నాకు ఫ్యాక్టరీలు, వ్యాపారాలు లేవు: పవన్‌ కల్యాణ్‌

January 31, 2020


img

జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ కార్యక్రమాలను పక్కన పెట్టి మళ్ళీ సినిమాలలోకి వెళుతున్నందుకు నిరసనగా ఆ పార్టీ సీనియర్ నేత (సిబిఐ మాజీ జెడి) లక్ష్మీనారాయణ గురువారం రాజీనామా చేసి పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేయడంకంటే దానికి ఆయన పేర్కొన్న కారణం పవన్‌ కల్యాణ్‌కు కొంచెం ఆగ్రహం కలిగించినట్లుంది. 

పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ, “నాకు సిమెంట్, పాల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లు, గనులు వంటివేవీ లేవు. పెద్ద జీతం పొందుతున్న ప్రభుత్వోద్యోగిని కూడా కాదు. నాకు తెలిసిందల్లా సినిమాలలో నటించడం మాత్రమే. నాపై ఆధారపడి అనేకమంది బ్రతుకుతున్నారు. వారందరి కోసం, నా కుటుంబం కోసం, నా పార్టీకి అవసరమైన నిధులు సమకూర్చుకోవడం కోసం నేను సినిమాలు చేయకతప్పడంలేదు. ఇవన్నీ లక్ష్మినారాయణగారు తెలుసుకొనుంటే బాగుండేది. ఏది ఏమినప్పటికీ, ఆయన పార్టీని విడిచిపెట్టినందుకు నాకు ఆయనపై ఎటువంటి కోపం, ద్వేషం లేవు. ఇదివరకు ఆయన పట్ల నాకు, మా పార్టీ నేతలకు ఎటువంటి గౌరవం ఉండేదో అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు,” అని చాలా హుందాగా సమాధానమిచ్చారు. 


Related Post