పవన్‌ కల్యాణ్‌కు లక్ష్మినారాయణ షాక్

January 30, 2020


img

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ పెద్ద షాక్ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌కు నిలకడైన విధివిధానాలు లేనందున పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆయన ఈరోజు సాయంత్రం పవన్‌ కల్యాణ్‌కు పంపించిన రాజీనామా లేఖలో “ఇక నుంచి పూర్తిగా రాజకీయాలలోనే ఉంటానని మీరు ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ మళ్ళీ సినిమాలలో నటించాలని మీరు తీసుకొన్న నిర్ణయం ద్వారా మీకు నిలకడైన రాజకీయ విధానాలు లేవని భావిస్తున్నాను. కనుక పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకొన్నాను,” అని వ్రాశారు. 

ఇప్పటికే చాలామంది నేతలు ఇంచుమించు ఇదేకారణంతో జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ జాబితాలో లక్ష్మినారాయణ కూడా చేరారు. పవన్‌ కల్యాణ్‌ మొదట టిడిపి, బిజెపిలతో కలిసి పనిచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబునాయుడు తీరు నచ్చక దానికి దూరం అయ్యారు. ఆ తరువాత ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు బిజెపికి దూరం అయ్యారు. 

2019 అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో చేతులు కలిపి పనిచేశారు. కనీసం 10-15 సీట్లు అయినా గెలుచుకోగలమనుకొంటే పవన్‌ కల్యాణ్‌, లక్ష్మినారాయణతో సహా పార్టీలో అందరూ ఘోరంగా ఓడిపోయారు. దాంతో అందరూ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. 

జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని తరలింపు, మూడు రాజధానుల ప్రతిపాదనలను పవన్‌ కల్యాణ్‌ గట్టిగా వ్యతిరేకించారు. ఈవిషయంలో కేంద్రం మాత్రమే జగన్‌ను అడ్డుకోగలదని భావించి పవన్‌ కల్యాణ్‌ రెండుసార్లు డిల్లీ వెళ్ళి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిశారు. డిల్లీలో ఆయన పవన్‌ కల్యాణ్‌కు ఏమి మంత్రం వేశారో తెలీదు కానీ విజయవాడ తిరిగి రాగానే బిజెపితో పొత్తులు పెట్టుకొన్నారు. దాంతో వామపక్షాలు దూరం అయ్యాయి. ఇప్పుడు సినిమాలలో నటించడానికి సిద్దం అవుతుండటంతో లక్ష్మినారాయణ కూడా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారు. 

మళ్ళీ సినిమాలతో బిజీ అయిపోతే జనసేనను పట్టించుకొనే నాధుడు ఉండడు కనుక మిగిలినవారు కూడా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే మెగా బ్రదర్స్ ఇద్దరూ రాజకీయాలలో రాణించలేక మళ్ళీ సినీరంగానికి వచ్చినట్లవుతుంది కనుక ఇద్దరి కధలో క్లైమాక్స్ ఒకేలా ఉంటుంది.


Related Post