ఖమ్మం మిర్చియార్డులో ఉద్రిక్త పరిస్థితులు

January 30, 2020


img

రాష్ట్రంలో మిర్చి అమ్మకాలు మొదలవగానే ఎప్పటిలాగే ఈసారి కూడా ఖమ్మం మిర్చియార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం క్వింటాలుకు రూ.17-18,000 ఉన్న ధర గురువారం  ఒకేసారి ఏకంగా రూ.5,000 తగ్గించి 12-13,000 చేయడంతో మిర్చి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, దళారులు, వ్యాపారులు కుమ్మక్కయి మిర్చిధరను తగ్గించేసి రైతులను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ రైతులు గురువారం ఉదయం నుంచి మిర్చియార్డులో ధర్నా చేస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌ వెంకట రమణను లోపలకు రానీయకుండా అడ్డుకొన్నారు. తమకు న్యాయమైన ధర చెల్లించేవరకు మార్కెట్ యార్డులో మిర్చి అమ్మకాలు జరుగనీయమని, అలాగే తాము మిర్చి అమ్మబోమని రైతులు భీష్మించుకొని కూర్చోన్నారు. 

చివరికి పోలీసుల సాయంతో లోపలకు ప్రవేశించిన మార్కెట్ కమిటీ చైర్మన్‌ వెంకట రమణ ఆందోళన చేస్తున్న మిర్చి రైతులతో సంప్రదింపులు జరిపి క్వింటాలుకు రూ.15,000 ధరను ఖరారు చేశారు. కానీ అమ్మకాలు మొదలవగానే క్వింటాలుకు రూ.10-12,000 మాత్రమే ధర పలుకుతుండటంతో మిర్చి రైతులు మళ్ళీ అమ్మకాలు నిలిపివేసి మిర్చి యార్డులో ధర్నా చేస్తున్నారు. 

రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టి ఉచితంగా సాగునీరు ఇస్తోంది. అలాగే ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇస్తోంది. రైతుబంధు పధకం కింద ఏకరాకు రూ. 5,000 చొప్పున ఏడాదికి రూ.10,000 ఇస్తోంది. రైతుల ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం సమన్వయ సమితిలను ఏర్పాటు చేసింది. నకిలీ విత్తనాలు, పురుగుల మందులమ్మేవారిపై కటిన చర్యలు తీసుకొంటోంది. ప్రభుత్వం తీసుకొన్న ఈ అన్ని చర్యలతో  రాష్ట్రంలో వ్యవసాయదిగుబడి క్రమంగా పెరుగుతోంది. కానీ అన్నీ చేసి పంటలకు సరైన ధరలు వచ్చేలా చేయకపోవడంతో అటు ప్రభుత్వం,  రైతుల కృషి, పెట్టుబడి, ప్రయత్నాలు అన్నీ వృధా అవుతున్నాయి. 

ఏటా వరి, మిర్చి, పత్తి, ఎర్రజొన్న, పసుపు రైతులు గిట్టుబాటు ధరల కోసం ఈవిధంగా ఆందోళనలు చేయడం చూస్తే ‘ఆపరేషన్ సక్సస్ బట్ పేషంట్‌ డెడ్’ అనిపించకమానదు. కనుక ఈ సమస్యను కూడా ప్రభుత్వం శాస్వితప్రాతిపదినక పరిష్కరించగలిగినప్పుడే ఆశించిన ప్రయోజనం ఫలిస్తుంది.


Related Post