టిఆర్ఎస్‌లో మళ్ళీ ఆ పాట మొదలైంది!

January 30, 2020


img

కొన్ని రోజుల క్రితం టిఆర్ఎస్‌లో కొందరు మంత్రులు, నేతలు కేటీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలంటూ ఒకరి తరువాత మరొకరు పాట పాడారు. దాంతో మునిసిపల్ ఎన్నికల తరువాత కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. మంత్రి గంగుల కమలాకర్ మాటలు వింటే ఆ ఊహాగానాలు నిజమేననిపిస్తోంది. 

ఈరోజు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేటీఆర్‌ తండ్రికి తగ్గ తనయుడు. మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఒంటిచేత్తో గెలిపించి తన సత్తాను చాటుకొన్నారు. తెలంగాణలో మరో 40 ఏళ్ళపాటు టిఆర్ఎస్‌యే అధికారంలో ఉండబోతోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని చూస్తున్న దేశప్రజలు కేసీఆర్‌ ప్రధానమంత్రి కావాలని కోరుకొంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొన్న కేటీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకొంటున్నారు,” అని అన్నారు. 

మునిసిపల్ ఎన్నికలకు ముందు సీఏఏపై టిఆర్ఎస్‌ వైఖరిని చెప్పడానికి కేటీఆర్‌ సైతం వెనుకాడారు. కానీ ఫలితాలు రాగానే సిఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి తమ పార్టీ సీఏఏకు వ్యతిరేకమని, సీఏఏను వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలను కలుపుకొని త్వరలోనే జాతీయస్థాయిలో పోరాటం మొదలుపెట్టబోతునట్లు చెప్పారు. 

సీఏఏపై సిఎం కేసీఆర్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియదు కానీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటే కేసీఆర్‌ హుందాగా తప్పుకోవలసి ఉంటుంది కనుక అందుకు సీఏఏ అంశంపై పోరాటం ఒక మార్గంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమనుకొంటే ఈ అధికారబదిలీ ఎప్పుడు? అంటే మార్చిలోగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సీఏఏను వ్యతిరేకిస్తూ నెలరోజుల్లోగా హైదరాబాద్‌లో 10లక్షల మందితో  సిఎం కేసీఆర్‌ బహిరంగసభ నిర్వహిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఫిబ్రవరి నెలాఖరులోగా యాదాద్రిపై మహాసుదర్శనయాగం చేయబోతున్న సంగతి తెలిసిందే. కనుక యాగం పూర్తయిన తరువాత ఎప్పుడైనా కేసీఆర్‌ తన పదవిలో నుంచి తప్పుకొని కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసే అవకాశం కనిపిస్తోంది. బహుశః ఉగాదికి (మార్చి 25)ముందు లేదా తరువాత జరుగవచ్చు. ఈ ఊహాగానం నిజమా..కాదా? అనే విషయం రానున్న రోజులలో సీఏఏపై సిఎం కేసీఆర్‌ కార్యాచరణ బట్టి, టిఆర్ఎస్‌ నేతల మాటలతోను తెలుసుకోవచ్చు. 


Related Post