సమత కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారు

January 30, 2020


img

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సమత అత్యాచార కేసులో ముగ్గురు దోషులకు ఆదిలాబాద్ ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. వారు ముగ్గురూ గత ఏడాది నవంబర్ 24న కొమురంభీం జిల్లా లింగాపూర్‌ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్‌లో సమత అనే దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసి, తరువాత దారుణంగా హత్య చేశారు. 

ఈ ఘటన జరిగిన మూడు రోజులలోనే పోలీసులు ముగ్గురు దోషులు షేక్ బాబు, షేక్ షాబూద్దీన్, షేక్ మఖ్దూంలను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 11న ప్రభుత్వం ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. డిసెంబర్ 14న పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలతో ఛార్జ్-షీట్ దాఖలు చేశారు. ఫాస్ట్-ట్రాక్ కోర్టు 66 రోజులలోనే విచారణ పూర్తిచేసి ముగ్గురు దోషులకు కలిపి రూ.26,000 జరిమానాలు విధించి, నేడు ఉరిశిక్షలు ఖరారు చేసింది. 

తుదితీర్పు వెలువరించే ముందు 'కోర్టుకు ఇంకేమైనా చెప్పుకోవాలనుకొంటున్నారా?' అని న్యాయమూర్తి దోషులను ప్రశ్నించినప్పుడు షేక్ బాబు తనకు భార్య చిన్నపిల్లలు, వృద్ధులైన తల్లితండ్రులు ఉన్నారని వారందరూ తనపైనే ఆధారపడి జీవిస్తున్నారని కనుక తనకు శిక్షను తగ్గించవలసిందిగా కన్నీళ్ళతో వేడుకొన్నాడు. మిగిలిన ఇద్దరు దోషులు కూడా అదేవిధంగా న్యాయమూర్తిని వేడుకొన్నారు. అయితే ముగ్గూరూ చాలా హేయమైన నేరానికి పాల్పడినట్లు రుజువు అయినందున ఉరిశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 

ఈరోజు తుదితీర్పు వెలువడుతున్న సందర్భంగా సమత భర్త, కుటుంబ సభ్యులు, వారి స్వగ్రామం గోనంపల్లెవాసులు కోర్టుకు తరలివచ్చారు. కోర్టు తీర్పుపై వారందరూ హర్షం వ్యక్తం చేశారు. 

అయితే దోషులు హైకోర్టు, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకొనేందుకు అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా దిగువకోర్టు తీర్పునే సమర్ధిస్తే, దోషులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవచ్చు. ఆ తరువాత నిర్భయ దోషులలాగే క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు. అయితే వారి తరపున ఇంత సుదీర్గ న్యాయపోరాటం చేసేందుకు ఎవరూ ముందుకు రానట్లయితే త్వరలోనే ఉరిశిక్షలు తప్పకపోవచ్చు.


Related Post