మృత్యువుతో నిర్భయ దోషుల పోరాటం

January 30, 2020


img

నిర్భయకేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1వ తేదీ ఉరిశిక్షను అమలుచేయడానికి తీహార్ జైలు అధికారులు అన్ని సిద్దం చేసుకొని ఎదురుచూస్తుంటే, ఉరిశిక్షను తప్పించుకోవడానికి వారు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. వారిలో ముకేష్ సింగ్‌ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయిన తరువాత అతనిపై జైలులో అత్యాచారం చేసినట్లు ఆరోపించబడుతున్న అక్షయ్ ఠాకూర్ బుదవారం సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్‌ వేశాడు. దానిపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపి తీర్పు చెపుతుంది. 

నిర్భయ దోషులు వేస్తున్న అన్ని పిటిషన్లను వరుసగా తిరస్కరిస్తున్న సుప్రీంకోర్టు అక్షయ్ ఠాకూర్ పిటిషన్‌ను కూడా కొట్టివేసే అవకాశాలున్నాయి. కనుక ఫిబ్రవరి 1వ తేదీ నలుగురికీ ఉరిశిక్షను అమలుచేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడే దోషుల తరపు న్యాయవాది అతితెలివి ప్రదర్శిస్తున్నారు.  

ఈ కేసులో మరో దోషి వినయ్ శర్మ తరపున బుదవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై రాష్ట్రపతి వెంటనే నిర్ణయం తీసుకోకపోతే అతనితో పాటు మిగిలిన ముగ్గురి ఉరిశిక్షలు కూడా వాయిదాపడతాయి. ఒకవేళ రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించినా నిబందనల ప్రకారం ఉరిశిక్షను అమలుచేయడానికి మరో 14 రోజులు ఆగవలసి ఉంటుంది. అంటే అతనితోపాటు మిగిలిన ముగ్గురూ కూడా ఫిబ్రవరి 1న ఉరిశిక్షను తప్పించుకోబోతున్నారన్న మాట! నలుగురికీ ఒకేసారి ఉరిశిక్ష అమలుచేయాలనే కోర్టు తీర్పులో చిన్న పాయింటును పట్టుకొని వారి న్యాయవాది ఏపీ సింగ్‌ ఇంత కధ నడిపిస్తున్నారు. మన న్యాయవ్యవస్థలో ఎన్ని లోపాలున్నాయో కళ్ళకు కట్టినట్లు చూపిస్తునందుకు ఆయన తెలివితేటలను మెచ్చుకోవాలా లేదా ఒక దారుణనేరానికి పాల్పడిన దోషులను  కాపాడేందుకు తన తెలివితేటలను దుర్వినియోగం చేస్తున్నందుకు బాధపడాలా? 


Related Post