ఏపీకి చెందిన కేవీపి తెలంగాణలో ఓటేయడమేమిటి?

January 30, 2020


img

కాంగ్రెస్‌ ఎంపీ కేవిపి రామచంద్రరావు ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఇటీవల ఆయన సూర్యాపేట జిల్లాలో నేరేడుచర్ల మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల కోసం ఎక్స్‌అఫీషియోగా పేరు నమోదు చేయించుకొని ఓటుహక్కును వినియోగించుకొనేందుకు ప్రయత్నించారు. కానీ రిటర్నింగ్ అధికారి ఆయన పేరు చేర్చడానికి నిరాకరించడంతో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డితో మాట్లాడి  ఆయన పేరును చేర్పించారు. అయితే కాంగ్రెస్‌ కంటే టిఆర్ఎస్‌కు ఒక ఎక్స్‌అఫీషియో అదనంగా ఉండటంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. దాంతో టిఆర్ఎస్‌కే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు దక్కాయి. 

ఈ పరిణామాలపై టిఆర్ఎస్‌ సీనియర్ నేత రైతు సమన్వయసమీతి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. “కాంగ్రెస్‌ నేతలకు ఆకారాలు పెరిగాయే కానీ బుద్ది మాత్రం పెరగలేదు. వారికి నియమనిబందనలు తెలియవు. తెలియనప్పుడు కనీసం తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయరు. ఏపీకి చెందిన కాంగ్రెస్‌ ఎంపీ కేవీపి రామచంద్రరావు తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలలో ఎక్స్‌అఫీషియోగా ఎలా ఓటేస్తారు? ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చి కేవీపి పేరును ఎక్స్‌అఫీషియోగా చేర్పించారు. పైగా నేరేడుచర్ల మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు దక్కించుకోలేకపోవడంతో అసూయతో మాపార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఎక్స్‌అఫీషియో ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దానినే మేము నేరేడుచర్ల వినియోగించుకొన్నాము తప్ప ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు. కానీ మునిసిపల్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌, బిజెపిలకు బుద్ది చెప్పినప్పటికీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కె.లక్ష్మణ్‌ బుద్ది మారలేదు,” అని విమర్శించారు.


Related Post