మరో అద్భుతం చేసి చూపిన చైనా

January 29, 2020


img

అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపడం చైనాను మించిన దేశాలు లేవనే చెప్పాలి. ఒకపక్క కరోనా మహమ్మారితో పోరాడుతూనే, కరోనా వ్యాధిగ్రస్తుల కోసమే ప్రత్యేకంగా వేయి పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. అందులో గొప్పేగా చెప్పుకోవడానికి ఏముంది అనుకొంటున్నారా? ఖాళీగా ఉన్న ఒక పెద్ద భవానాన్ని కేవలం 48 గంటలలో అన్ని హంగులతో కూడిన 1,000 పడకల ఆసుపత్రిగా సిద్దం చేసి వెంటనే దానిలో రోగులకు వైద్యచికిత్సలు కూడా అందించడం మొదలుపెట్టింది. 

చైనాలో హువాంగ్జౌ జిల్లాలో వుహాన్ అనే ప్రాంతంలో కరోనా రోగులకు చికిత్స అందించే కేంద్రం ఉంది. అయితే నానాటికీ కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో దానికి సమీపంలో ఆసుపత్రి కోసం నిర్మించిన ఓ ఖాళీ భవనాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకొన్నారు. అప్పటి నుంచి కేవలం 48 గంటల వ్యవదిలో ఆసుపత్రికి అవసరమైన పడకలు, ఐసీయూ, కంప్యూటర్లు, కరెంటు, నీళ్ళు, రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం వంటి సకల సౌకర్యాలతో ఆసుపత్రిని సిద్దం చేసేశారు. మంగళవారం రాత్రి నుంచి దానిలో రోగులను చేర్చుకొని చికిత్స అందించడం కూడా ప్రారంభించారు. దీనికోసం సుమారు 500 మంది నిర్మాణ కార్మికులు, వందలాదిమంది పోలీసులు, అధికారులు నిర్విరామంగా పనిచేశారు. అందరూ కలిసి చక్కటి సమన్వయంతో పనిచేసి అన్ని పనులను 48 గంటలలో పూర్తి చేశారు. ఈ ఆసుపత్రికి డబీ మౌంటెయిన్ రీజియనల్ మెడికల్ సెంటర్ అని నామకరణం చేశారు. 

ఇంకా చెప్పుకోవలసిన మరో గొప్ప విశేషమేమిటంటే, ఆ ఆసుపత్రికి సమీపంలోనే మరో రెండు 1,000 పడకల ఆసుపత్రులు పునాది స్థాయి నుంచి నిర్మిస్తున్నారు. ఆ రెంటినీ కేవలం 5 రోజులలో నిర్మించి, సోమవారంనాటికల్లా రోగులను చేర్చుకోవడానికి సిద్దం చేయాలని లక్ష్యంగా పెట్టుకొని యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నారు. 



Related Post