అందరికీ శకునం చెప్పిన బల్లి...

January 29, 2020


img

 అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడి చచ్చిందన్నట్లు బిజెపి, వైసీపీ, జేడియు పార్టీలను ఎన్నికలలో గెలిపించి అధికారం చేజిక్కించుకొనేందుకు సాయపడిన ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ బుదవారం జెడియు పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. 

ఆ పార్టీ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) బిల్లును సమర్ధిస్తుండగా, ఆ పార్టీకి ఉపాధ్యక్షుడుగా ఉన్న ఆయన దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం వ్యతిరేకించడానికే పరిమితం అయితే పరవాలేదు...దేశంలో సీఏఏను వ్యతిరేకిస్తున్న పార్టీలన్నిటినీ ఒక్క తాటిపైకి వచ్చి పోరాడాలంటూ ప్రేరేపిస్తున్నారు. జెడియు అధ్యక్షుడు నితీశ్ కుమార్ వారించినప్పటికీ వెనక్కు తగ్గకపోవడంతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జెడియు ప్రకటించింది.              

ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్‌ను ఉద్దేశ్యించి జెడియు సీనియర్ నేత అజయ్ అలోక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ప్రశాంత్ కిషోర్ అంత నమ్మదగిన వ్యక్తి కాదని నా అభిప్రాయం. ఆయన రాహుల్ గాంధీతో కూర్చొని కబుర్లు చెపుతాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న ఆమాద్మీ పార్టీ కోసం పనిచేస్తాడు. బిజెపి కోసం పనిచేసిన ఆయన బిజెపిని వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ కోసం పనిచేస్తానంటాడు. ఆయనను నమ్మేదెలా? ఆయన ఓ కరోనా వైరస్ వంటివాడు. ఇంతకాలం మా పార్టీకి పట్టిన ఆ వైరస్ పీడ విరగడైపోయింది. ఇక మేము ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు,” అని అన్నారు.


Related Post