కాంగ్రెస్‌, బిజెపిలే ఆలోచించుకోవాలి...

January 29, 2020


img

లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా ఏడు సీట్లు గెలుచుకొన్న కాంగ్రెస్‌, బిజెపిలు…కేసీఆర్‌ సర్కార్ పట్ల ప్రజలలో విముఖత పెరిగిందని.. ఆ కారణంగా రాష్ట్రంలో తమకు మళ్ళీ ప్రజాధారణ పెరిగిందనే భ్రమ లేదా అపోహలో ఉండిపోయారని చెప్పక తప్పదు. అందుకే మునిసిపల్ ఎన్నికలలో రెండుపార్టీలు బోర్లాపడ్డాయి. అయితే అదొక్కటే కారణం కాదు. ఎన్నికలంటే ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన టిఆర్ఎస్‌ ప్రతీ ఎన్నికలను జీవన్మరణ సమస్య అన్నట్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంటుంది. అలాగే ప్రతీ ఎన్నికలలోనూ సామదానబేదదండోపాయాలన్నిటినీ ఉపయోగిస్తుంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. 

వాస్తవానికి ఇటువంటి పోరాటస్పూర్తి, వ్యూహరచనా చాతుర్యం ప్రతిపక్షాలకు తప్పనిసరిగా ఉండాలి. కానీ అవి కొరవడటమే కాక సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు తదితర టిఆర్ఎస్‌ నేతలను ఎదుర్కొనే బలమైన నాయకత్వం కూడా కొరవడిందని చెప్పక తప్పదు. 

కాంగ్రెస్‌, బిజెపి నేతలు టిఆర్ఎస్‌ నేతలపై విమర్శలు, ఆరోపణలు చేయగలుగుతున్నారే కానీ టిఆర్ఎస్‌ వ్యూహాలను ఎదుర్కొలేకపోతున్నారని ఎన్నికల ఫలితాలే చెపుతున్నాయి. అలాగే ప్రజలకు చేరువయ్యేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. 55 రోజుల పాటు జరిగిన ఆర్టీసీ సమ్మెలో ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌, బిజెపిలు అండగా నిలబడి పోరాడినప్పటికీ, ప్రజలు వాటిని గుర్తించలేదని మునిసిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఎప్పటికైనా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని ఆశపడుతున్న కాంగ్రెస్‌, బిజెపిలకు ఇవన్నీ తెలియనివి కావు. కానీ టిఆర్ఎస్‌ను ఏవిధంగా ఎదుర్కోవాలో... ప్రజలను ఏవిధంగా ప్రసన్నం చేసుకోవాలనే ఫార్ములాను కనిపెట్టలేక బోర్లాపడుతూనే ఉన్నాయి. ఇక మునిసిపల్ ఎన్నికలలోనే విశ్వరూపం చూపించిన టిఆర్ఎస్‌, కీలకమైన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఇంకెంత కటినంగా వ్యవహరిస్తుందో తేలికగానే ఊహించుకోవచ్చు. కనుక అప్పటిలోగా కాంగ్రెస్‌, బిజెపిలు ఈ సవాళ్ళను, సమస్యలను అధిగమించడానికి ఏదో ఓ మార్గం కనుగోవలసి ఉంటుంది. కాదని ఇదేవిధంగా మూసరాజకీయాలు చేస్తూ, టిఆర్ఎస్‌పై రోజూ విమర్శలు, ఆరోపణలతో కాలక్షేపం చేస్తే వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా రాకపోవచ్చు.



Related Post