నిర్భయకేసులో మరో ట్విస్ట్

January 29, 2020


img

ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలలోపు నిర్భయకేసులో నలుగురు దోషులకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలుచేయవలసి ఉంది. అంటే మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉందన్న మాట. కానీ నేటికీ వారు ఉరిశిక్షను తప్పించుకొనేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. చావు దగ్గరపడుతున్న ఈ సమయంలో వారికి సుప్రీంకోర్టు నిర్ణయం చిన్న ఆశ కల్పించింది. ఉరిశిక్ష పడిన వ్యక్తులు ఏదైనా పిటిషన్‌ పెట్టుకొంటే దానిని అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

నలుగురు దోషులలో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో అతను మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కనుక ముఖేష్ సింగ్ పెట్టుకొన్న పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆ సందర్భంగా అతని తరపు వాదించిన న్యాయవాది మరో సంచలన విషయం కోర్టుకు తెలియజేశారు. నిర్భయ కేసులో నలుగురు దోషులలో ఒకడైన అక్షయ్ సింగ్ జైల్లో ముఖేష్ సింగ్‌పై అనేకసార్లు అత్యాచారం చేశాడని, తీహార్ జైలు అధికారుల ప్రోత్సాహంతోనే ఇది జరిగిందని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. క్షమాభిక్ష పిటిషన్‌లో ఈవిషయం పేర్కొనాలని జైలు అధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదని చెప్పారు. కనుక ముఖేష్ సింగ్ శిక్షను తగ్గించి జీవితఖైదుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. 

నిర్భయకేసుపై గత ఏడు సం.లుగా సుదీర్గంగా విచారణ జరిపి నలుగురు దోషులేనని నిర్ధారించిన తరువాతే సుప్రీంకోర్టు వారికి ఉరిశిక్ష ఖాయం చేసింది. ఇటువంటి కేసులలో చివరి అవకాశంగా వారు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోవడం, దానిని ఆయన తిరస్కరించడం కూడా జరిగింది. కనుక దోషులకు ఉరిశిక్ష అమలుచేయాల్సి ఉంది. కానీ రాష్ట్రపతి వారికి క్షమాభిక్ష తిరస్కరించిన తరువాత మళ్ళీ దానిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం విస్మయం కలిగిస్తుంది. శిక్షలను తప్పించుకొనేందుకు మన న్యాయవ్యవస్థలో ఇటువంటి మార్గాలు ఉన్నందునే నేరస్తులలో భయం ఏర్పడటంలేదు. దాంతో బాధితులు న్యాయం కోసం ఏళ్ల తరబడి న్యాయపోరాటాలు చేస్తూ మళ్ళీ ‘న్యాయ బాధితులు’గా వేధన అనుభవించాల్సి వస్తోంది. ఒక్కోసారి న్యాయం జరుగడంలో ఆలస్యమైనప్పుడు ఉన్నావో అత్యాచార బాధితురాలిలా నేరస్తుల చేతిలోనే సజీవదహనం అవుతున్నారు. అయినా మన న్యాయవ్యవస్థల తీరు మారలేదు.


Related Post