కేసీఆర్‌, కేటీఆర్‌లపై నిప్పులు కక్కిన కోమటిరెడ్డి

January 28, 2020


img

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సిఎం కేసీఆర్‌, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లపై నిప్పులు చెరిగారు. ఈరోజు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధులను గెలిపించుకొనే బాద్యత మంత్రులదేనని లేకుంటే మంత్రిపదవులు ఊడగొడతానంటూ సిఎం కేసీఆర్‌ మొదటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశారు. దాంతో టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు రెచ్చిపోయి ఇతర పార్టీల అభ్యర్ధులను భయభ్రాంతులను చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు కొన్ని మునిసిపాలిటీలలో విజయం సాధించడంతో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రంగంలో దిగి టిఆర్ఎస్‌ రెబెల్స్, ఇండిపెండెంట్లు, ఎక్స్‌అఫీషియోలను, చివరికి కాంగ్రెస్‌, సిపిఎం కౌన్సిలర్లను భయపెట్టి లొంగదీసుకొని మేము గెలుచుకొన్నవాటిని కూడా బలవంతంగా లాక్కొన్నారు. 

నల్గొండలో మాకు 9 మునిసిపాలిటీలలో మెజార్టీ వచ్చింది కానీ టిఆర్ఎస్‌ కుయుక్తులకు పాల్పడి ఏడింటిని లాక్కొంది. పెద్ద అంబర్ పేట, చౌటుప్పల్‌లో మా కౌన్సిలర్లను టిఆర్ఎస్‌ ఎత్తుకుపోయింది. ఎన్నికలలో మాకు మిత్రపక్షంగా వ్యవహరించిన సిపిఎంను కొనేసింది. నేరేడుచెర్లలో రాత్రికి రాత్రి టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీని ఎక్స్‌అఫీషియోగా చేర్చి అడ్డుగోలుగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకొంది. 

రెబెల్స్‌ను మళ్ళీ పార్టీలో చేర్చుకోమని చెప్పిన కేసీఆర్‌, కేటీఆర్‌ ఎన్నికలవగానే గెలిచిన రెబెల్స్ అందరినీ మళ్ళీ పార్టీలో చేర్చుకొని వారి అండదండలతోనే మునిసిపాలిటీలను దక్కించుకొన్నారు. పోలీసులను, ఎన్నికల అధికారులను అందరినీ చెప్పుచేతలలో పెట్టుకొని సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ఎన్నికలలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేశారు. గత 25 ఏళ్ళలో ఇంత దారుణంగా ఎన్నికలు జరుగలేదు. సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మాకు వారు చేసిన ఈ అన్యాయానికి తప్పకుండా వారిపై ప్రతీకారం తీర్చుకొంటాము. వాళ్ళు చేసిన అవినీతికి సంబందించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. వాటిని ఈడీ, విజిలెన్స్ అధికారులకు అందజేస్తాము. ఏదో ఒక రోజు కేసీఆర్‌ కుటుంబం మొత్తం జైలుకు వెళ్ళేరోజు తప్పకుండా వస్తుంది. ఈ ఎన్నికలలో కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా ఖూనీ చేశారో పల్లెపల్లెలో తిరిగి ప్రజలకు వివరించి చైతన్యపరుస్తాము,” అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

టిఆర్ఎస్‌ అవినీతి, అక్రమాలకు పాల్పడి మునిసిపల్ ఎన్నికలలో గెలిచిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తుంటే, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపధకాలను మెచ్చి ప్రజలు తమను గెలిపించారని టిఆర్ఎస్‌ నేతలు చెప్పుకొంటున్నారు. ఇరుపార్టీల వాదనలలో నిజానిజాలు ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఓటువేయడం వరకే వారి బాధ్యత. ఆ తరువాత వారి అభిప్రాయానికి  విలువలేదు కనుక వారు చేయగలిగిందేమీ లేదు. కనుక కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్‌తో రాజకీయంగానే తేల్చుకోవలసి ఉంటుంది. ఆ శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందో లేదో ముందు తెలుసుకోవలసిన అవసరం కూడా ఉంది.


Related Post