ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్ భారత్‌ పర్యటన?

January 28, 2020


img

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఇంతరవరకు భారత్‌లో పర్యటించలేదు. రెండేళ్ళ క్రితం హైదరాబాద్‌ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సుకు ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ మాత్రం హాజరయ్యారు. ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత్‌ పర్యటించబోతున్నట్లు తాజా సమాచారం.  

ఆయన ఫిబ్రవరి 21 నుంచి 24 మద్య భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్‌, అమెరికా ప్రభుత్వాలు ట్రంప్ పర్యటనపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ట్రంప్ విదేశీ పర్యటనలకు ఏర్పాట్లు చేసే అమెరికా అధికారులు డిల్లీలో ఒక స్టార్ హోటల్‌ను బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. అంటే ట్రంప్ భారత్‌ పర్యటన ఖాయమనే భావించవచ్చు. 

గత ఏడాది ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్ నగరంలో చాలా అట్టహాసంగా ‘హౌడీ మోడీ’ కార్యక్రమం జరిగింది. దానిలో డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొని  అక్కడి ప్రవాసభారతీయులలో ప్రధాని నరేంద్రమోడీకి ఎంత ఆధరణ ఉందో స్వయంగా కళ్ళారా చూశారు. ఇప్పుడు ఆయన భారత్‌ వచ్చినప్పుడు ఆదే స్థాయిలో ఆయనను గౌరవించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

మళ్ళీ మరోసారి అమెరికా అధ్యక్షుడవ్వాలని డొనాల్డ్ ట్రంప్ కోరుకొంటున్న ట్రంప్ భారత్‌ పర్యటన ద్వారా అమెరికాలో స్థిరపడిన ప్రవాసభారతీయులను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చు. ఈ విషయం ప్రధాని నరేంద్రమోడీకి కూడా బాగా తెలుసు. పైగా ప్రస్తుత పరిస్థితులలో భారత్‌కు అమెరికా సహాయసహకారాలు చాలా అవసరం. కనుక భారత్‌, అమెరికా దేశాలతో పాటు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా వ్యక్తిగంగా లబ్ది కలిగించేవిధంగా ఈ పర్యటన సాగే అవకాశం కనిపిస్తోంది.


Related Post