సచివాలయం విచారణలోనే తీర్పు కనిపిస్తోంది

January 28, 2020


img

తెలంగాణ సచివాలయం కూల్చివేసి దాని స్థానంలో కొత్త సచివాలయ భవనాలను నిర్మించాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనానికి ప్రభుత్వం తరపు వాదించిన అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావుకు మద్య జరిగిన సంభాషణ ఈ కేసులో తుదితీర్పు ఏవిధంగా ఉండబోతోందో ముందే స్పష్టం చేస్తోంది. 

దీనికి సంబందించి ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ దాఖలుచేసిన అఫిడవిట్‌ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం దానిలో కొత్త సచివాలయానికి సంబందించి వివరాలు లేకపోవడంతో “కొత్త సచివాలయ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత విస్తీర్ణంలో దానిని నిర్మించాలనుకొంటోంది?ఇంతవరకు దాని డిజైన్లు ఎందుకు ఖరారు చేయలేదు?” అంటూ జే రామచంద్రరావును ప్రశ్నించగా, “హైకోర్టు అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని, హైకోర్టుపై గౌరవంతో ప్రభుత్వం ఆగిపోయిందని” జే రామచంద్రరావు సమాధానం చెప్పారు. 

అప్పుడు హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, “తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు సచివాలయాన్ని కూల్చవద్దన్నాము కానీ కొత్త సచివాలయం నిర్మాణానికి అంచనాలు, డిజైన్ల విషయంలో అభ్యంతరం చెప్పలేదు కదా? అయినా కొత్త సచివాలయానికి సంబందించి పూర్తి వివరాలు తెలియకుండా ఏవిధంగా విచారణ జరుపగలము?” అని ప్రశ్నించింది. 

కేవలం విచారణ కోసమే కోట్లు రూపాయలు ఖర్చు చేసి డిజైన్లు రూపొందించాలని కోరడం కాస్త అసంబద్దంగానే ఉంది. కొత్త సచివాలయ నిర్మాణ వ్యయం అంచనాలు రూపొందించడానికి, డిజైన్లు ఖరారు చేయడానికి హైకోర్టుకు అభ్యంతరం లేదని చెప్పడమంటే కొత్త సచివాలయ నిర్మాణానికి అభ్యంతరం చెప్పబోదనే అర్ధమవుతోంది. కనుక ఈ కేసు విచారణలోనే తుది తీర్పు ఏవిధంగా ఉండబోతోందో స్పష్టమవుతోంది. 

ఇక హైకోర్టు మీద గౌరవంతో ఈ విషయంలో ముందుకు వెళ్లలేదని అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి ఇదే కేసుపై ఇంతకు ముందు విచారణలో కొత్త సచివాలయం నిర్మాణానికి సుమారు రూ.400-500 కోట్లు వ్యయం అవుతుందని ఆయనే చెప్పారు. అప్పుడు హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ “ప్రస్తుతం ఆర్ధికమాంద్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధికపరిస్థితి బాగోలేదని న్యూస్ పేపర్లలో చదివాము. ఈ పరిస్థితులలో ఇంత ఖర్చు అవసరమా?” అని ప్రశ్నించింది. అంటే కొత్త సచివాలయం నిర్మాణవ్యయం ఎంతో అప్పుడే కోర్టుకు చెప్పడం జరిగిందన్న మాట. 

అలాగే దేశంలో నాలుగు ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థలు కొత్త సచివాలయం డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించాయని, వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోందని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. మరి హైకోర్టుపై గౌరవంతో ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదని జె రామచంద్రరావు చెప్పడం ఏమిటి?


Related Post