నేరేడుచర్లలో ఉద్రిక్తవాతావరణం

January 28, 2020


img

సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మునిసిపల్ కార్యాలయం వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనున్నాయి. నేరేడుచర్లలో కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ల బలాబలాలు సరిసమానం అవడంతో ఇరుపార్టీలు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు పోటీ పడుతుండటంతో సోమవారం ఇరుపార్టీల మద్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఆ కారణంగా రిటర్నింగ్ అధికారి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను ఈరోజుకు వాయిదా వేశారు. అయితే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకొనేందుకు టిఆర్ఎస్‌ నిన్న రాత్రి ఎమ్మెల్సీ శేరి సుబాష్ రెడ్డి పేరును ఎక్స్‌అఫిషియోగా ఓటర్ల జాబితాలు చేర్పించడంతో టిఆర్ఎస్‌ బలం 11కు చేరింది. దాంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీకి చేతికి అందివచ్చినట్లే వచ్చి చేజారిపోయే పరిస్థితి ఏర్పడింది. రాత్రికి రాత్రి టిఆర్ఎస్‌ ఓటర్ల జాబితాలో మరో ఎక్స్‌అఫిషియోను చేర్చడంపై పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ మొదలవక మునుపు కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేరును ఎక్స్‌అఫిషియోగా చేర్చడానికి నిరాకరించిన రిటర్నింగ్ అధికారి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యాక అర్ధరాత్రి కొత్తగా టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పేరును చేర్చడం ఏమిటని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ శేరి సుబాష్ రెడ్డి పేరును తొలగించకపోతే కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తున్నారు.   

ఈరోజు ఉదయం నుంచి నేరేడుచర్ల మునిసిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు చేరుకొని ఆందోళన ప్రారంభించారు. వారిని అడ్డుకొనేందుకు టిఆర్ఎస్‌ శ్రేణులు కూడా తరలివచ్చి పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలను ముందే ఊహించిన జిల్లా ఎస్పీ నేరేడుచర్ల మునిసిపల్ కార్యాలయం వద్ద ఏకంగా 800 మంది పోలీసులను మోహరించారు. నేరేడుచర్ల మునిసిపల్ కార్యాలయం వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనున్నాయి.


Related Post