కాంగ్రెస్‌, బిజెపిలలో ఏది బీ-టీం? కేటీఆర్‌

January 28, 2020


img

మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఘనవిజయం సాధించిన తరువాత తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌, బిజెపిలు పేరుకే జాతీయపార్టీలు కానీ అవి ఒకటి రెండు పదవులను దక్కించుకోవడం కోసం గల్లీ పార్టీల కంటే చవుకబారుగా వ్యవహరించాయి. టిఆర్ఎస్‌ బిజెపికి బి-పార్టీ అని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటుంది. కాదు... టిఆర్ఎస్‌ కాంగ్రెస్‌కి బి-పార్టీ అని బిజెపి ఆరోపిస్తుంటుంది. కానీ నిన్న ఆ రెండు పార్టీలే ఒకదానికొకటి బి-టీంలుగా మారడాన్ని అందరూ కళ్ళారా చూశారు. బద్ధ శత్రువులమని చెప్పుకొనే కాంగ్రెస్‌, బిజెపి నేతలు కలిసి నిన్న రోడ్లపై ఆందోళనలు చేస్తుంటే ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే సంగతి బట్టబయలైంది,” అని అన్నారు. 

రంగారెడ్డిజిల్లా మణికొండ కార్పొరేషన్ పరిధిలో 20 స్థానాలలో కాంగ్రెస్‌-8, బిజెపి-6, టిఆర్ఎస్‌-5, స్వతంత్ర అభ్యర్ధి-1 గెలుచుకొన్నారు. అన్నిటికంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు గెలుచుకొన్నందున మేయర్, డెప్యూటీ మేయర్ పదవులను ఆశించడం సహజం. అలాగే 6 స్థానాలు గెలుచుకొన్న బిజెపి కనీసం డెప్యూటీ మేయర్ పదవి దక్కించుకోవాలని ఆశపడటం సహజమే. కానీ కేవలం 5 స్థానాలే గెలుచుకొన్న టిఆర్ఎస్‌ ఎక్స్‌అఫిషియో ఓట్లతో కీలకమైన ఆ రెండు పదవులను దక్కించుకోవడానికి ప్రయత్నించడంతో కాంగ్రెస్‌, బిజెపిలు దానిని అడ్డుకొని ఆ పదవులను దక్కించుకోవడం కోసం తమ రాజకీయవైరాన్ని కాసేపు పక్కనపెట్టడంతో మేయర్ పదవి కాంగ్రెస్ పార్టీ దక్కించుకొంది. ఇది టిఆర్ఎస్‌ జీర్ణించుకోవడం కష్టమే. అదే కేటీఆర్‌ మాటలలో వినిపించిందనుకోవచ్చు. దీనిని పదవుల కోసం స్థానిక నేతల మద్య అవగాహనగానే చూడాలి తప్ప కాంగ్రెస్‌, బిజెపిలు కుమ్మక్కని చెప్పడం సరికాదు.


Related Post