ఏపీ శాసనమండలి రద్దు

January 27, 2020


img

ఏపీలో సుమారు 10 ఏళ్లపాటు నిరంతరంగా పోరాడి చాలాభారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సుమారు 9 నెలాల్ క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా ఏదో ఒకటి రద్దు చేస్తూనే ఉన్నారు. పోలవరం కాంట్రాక్టులు రద్దు.. విద్యుత్ ఒప్పందాలు రద్దు.. అన్నా క్యాంటీన్లు రద్దు...రాజధాని అమరావతి రద్దు..దాని కోసం ఏర్పాటు చేసిన సీఆర్‌డీఏ రద్దు..ఇలా చెప్పుకొంటూపోతే ఈ రద్దుల జాబితా చాలా పెద్దదే ఉంది. 

మూడు రాజధానుల ప్రతిపాదనకు శాసనమండలిలో ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పుడు శాసనమండలినే రద్దు చేయడానికి సిఎం జగన్ సిద్దపడుతున్నారు. ఈరోజు ఉదయం హడావుడిగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన తరువాత వెంటనే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. జగన్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ టిడిపి ఎమ్మెల్యేలు నేడు శాసనసభను బహిష్కరించడంతో ఇక శాసనసభలో వైసీపీని ప్రశ్నించేవారేలేకుండాపోయారు. దాంతో శాసనసభలో వైసీపీ సభ్యులే పోటాపోటీగా మండలి రద్దు తీర్మానాన్ని సమర్ధిస్తూ మాట్లాడుతున్నారు. మరికొద్ది సేపటిలో మండలిని రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదముద్ర వేయబోతోంది. 

అయితే మండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసినప్పటికీ దానిని పార్లమెంటు ఆమోదం తెలుపవలసి ఉంటుంది. కనుక అక్కడ చాలా ఆలస్యం జరుగవచ్చు లేదా ఒకవేళ ఏపీ బిజెపి సూచన మేరకు కేంద్రప్రభుత్వం దానిని పక్కన పెట్టినా పెట్టవచ్చు. కనుక జగన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలుచేయడానికి ఆర్డినెన్స్ జారీ చేయవలసిరావచ్చు. ఒకవేళ కేంద్రప్రభుత్వం మండలి రద్దును వ్యతిరేకించినా లేదా తిరస్కరించినా జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు.  

ఇక మండలిని రద్దు చేయడంతో టిడిపి ఎమ్మెల్సీలు ఎలాగూ పదవులు కోల్పోతారు. కానీ వారితో పాటు ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణలతో సహా మొత్తం తొమ్మిది మంది వైసీపీ ఎమ్మెల్సీలు కూడా పదవులు కోల్పోనున్నారు. మండలి రద్దు కాగానే ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. వారందరికీ మళ్ళీ పదవులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇక మండలి ఉండదు కనుక వైసీపీలో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారికీ, ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరినవారికి వాటికి బదులు వేరే పదవులు కల్పించవలసి ఉంటుంది. కనుక మండలి రద్దు తొందరపాటు నిర్ణయమే అని చెప్పవచ్చు. చేజెతులా ఒక సమస్యను సృష్టించుకొని దానిని అధిగమించడానికి జగన్ ప్రభుత్వం చేజేతులా ఇలాగ ఇంకో సమస్యను సృష్టించుకోవడం ఆశ్చర్యకరమే కదా?


Related Post