ఆధార్‌తో ఓటరు కార్డులు అనుసంధానం...మంచిదే

January 25, 2020


img

ఆధార్‌తో ఓటరు కార్డులు అనుసంధానం చేయాలనే కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రతిపాదనకు కేంద్ర న్యాయశాఖ అంగీకరించింది. ఆధార్‌తో ఓటరు కార్డులు అనుసంధానం చేసినట్లయితే ఒక వ్యక్తి వేర్వేరు రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుంచి ఓటువేయకుండా నిరోధించవచ్చునని, అలాగే బోగస్ ఓట్లను కూడా ఏరివేయవచ్చని కేంద్ర ఎన్నికల కమీషన్ భావిస్తోంది. ముఖ్యంగా బోగస్ ఓట్లు చాలా పెద్ద సమస్యగా మారినందున ఈసీ ప్రతిపాదనకు కేంద్రన్యాయశాఖ ఆమోదం తెలిపింది. 

కనుక త్వరలో కేంద్రమంత్రిమండలి సమావేశంలో దీనికి సంబందించి ఓ బిల్లును ఆమోదించి, దానిని బడ్జెట్‌ సమావేశాలలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఒకవేళ బడ్జెట్‌ తొలి సమావేశాలలోనే ఆమోదం తెలిపితే ఈ నిబందన వెంటనే అమలులోకి వస్తుంది. అప్పుడు దేశంలో ఓటర్లందరూ తమ ఓటర్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకొనేవారు ఆధార్ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించవలసి ఉంటుంది.  

 అయితే దీనిలో కొత్త, పాత ఓటర్లు తమ ఆధార్‌ వివరాలు ఇచ్చేందుకు నిరాకరించే వెసులుబాటు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా ఏ కారణం చేతైనా తమ ఆధార్‌ వివరాలను ఇవ్వదలచుకోకపోతే వారికి ఓటుహక్కును తిరస్కరించే అధికారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి ఉండదు. అటువంటప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి లేదా కేంద్ర ఎన్నికల కమీషన్ తుది నిర్ణయం తీసుకొంటుంది.

బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు, రేషన్ కార్డు, సంక్షేమ పధకాలు, మొబైల్, ల్యాండ్ లైన్ ఫోన్‌ కనెక్షన్స్.. ఇలా ప్రతీదానిని ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నప్పుడు దేశభవిష్యత్తును నిర్దేశించే ఓటర్ కార్డులను ఎందుకు అనుసంధానం చేయడంలేదనే ప్రశ్నకు ఈ తాజా ప్రతిపాదనతో కేంద్ర ఎన్నికల కమీషన్ ఇన్నాళ్ళకు సరైన సమాధానం చెప్పినట్లయింది. 

అయితే సీఏఏను వ్యతిరేకిస్తూ ఆందోళనచేస్తున్నవారు, కేంద్రప్రభుత్వం వద్ద ఉన్న ఆధార్ డేటా ఆధారంగా దేశంలోని బోగస్ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల కమీషన్‌కు అధికారం కట్టబెడితే అభ్యంతరం చెప్పకుండా ఊరుకొంటారా? ఓటరు కార్డులకు ఆధార్ వివరాలను లింక్ చేస్తామంటే అంగీకరిస్తారా? ముఖ్యంగా బోగస్ ఓట్లతో ఎన్నికలలో గెలుచుకొనేందుకు అలవాటుపడిన రాజకీయపార్టీలు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తాయా లేదా? చూడాలి.


Related Post