ఏపీ సిఎం జగన్‌కు ఈడీ కోర్టు షాక్

January 25, 2020


img

సింహం అడవిలో ఉంటే చాలా గొప్పగా ఉంటుంది. అదే...బోనులో ఉంటే అందరికీ చులకనే! ప్రస్తుతం ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. 

ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను, రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను కూడా శాశిస్తూ, ప్రతిపక్ష టిడిపిని గడగడలాడిస్తున్నప్పటికీ అక్రమాస్తుల కేసులో సిబిఐ, ఈడి కోర్టు బోనులో చేతులు కట్టుకొని నిలబడవలసివస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్‌, నాంపల్లి సిబిఐ కోర్టు ప్రతీ శుక్రవారం ఈ అక్రమాస్తులకేసులపై విచారణ జరుపుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కేసుల విచారణకు ఆయన హాజరైనా కాకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకొనేవారు కారు. కానీ ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక ఆ కేసుల విచారణకు హాజరైనా, కాకపోయినా వార్త అవుతోంది.

నిన్న..శుక్రవారం ఈడీ కోర్టులో జరిగిన విచారణకు జగన్‌ హాజరుకాలేదు. ముఖ్యమంత్రిగా తాను అనేక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది కనుక వ్యక్తిగతహాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, తనకు బదులు ఏ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి హాజరవుతారని తన న్యాయవాదుల ద్వారా జగన్ కోర్టును అభ్యర్ధించారు. కానీ ఈడీ న్యాయవాదులు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. పదేపదే వ్యక్తిగతహాజరు నుంచి మినహాయింపు కోరడంపై న్యాయమూర్తి కూడా అసహనం వ్యక్తం చేశారు. ఆ అభ్యర్ధనను తిరస్కరిస్తూ వచ్చే శుక్రవారం జరిగే విచారణకు జగన్ తప్పనిసరిగా హాజరుకావాలని లేకుంటే తదుపరి ఆదేశాలు జారీచేయవలసి వస్తుందని హెచ్చరించారు. కనుక వచ్చేవారం ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుకు హాజరుకాకతప్పదు. ఒకవేళ హాజరు కాకూడదనుకొంటే, హైకోర్టులో పిటిషన్‌ వేసి అనుమతి పొందవలసి ఉంటుంది.


Related Post