బిల్లు తిరస్కరించినందుకు మండలి రద్దు?

January 24, 2020


img

సాధారణంగా అధికార పార్టీలకు శాసనసభలో, మండలిలో కూడా పూర్తి మెజార్టీ ఉన్నట్లయితే ఎటువంటి వివాదాస్పదమైన బిల్లుకైనా ఆమోదముద్ర పడుతుంది. కానీ ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష టిడిపికి మెజార్టీ ఉంది. పైగా మండలి ఛైర్మన్ టిడిపికి చెందినవారు కావడంతో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ బిల్లులను మండలి తిరస్కరించింది. వాటిని సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి ఛైర్మన్ ఏంఏ షరీఫ్ నిర్ణయించడంతో రాజధాని మార్పుకు తాత్కాలికంగా బ్రేకులు పడటంతో ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి చెరగని చిర్నవ్వుతో కనిపిస్తున్న జగన్ నిన్న తొలిసారిగా శాసనసభలో తీవ్రఆగ్రహావేశంతో మాట్లాడారు. రాజకీయాలకు నిలయంగా మారిన శాసనమండలిపై నెలకు 50 కోట్లు ఖర్చు చేస్తూ కొనసాగించవలసిన అవసరం ఉందా? ప్రజలకు ఉపయోగపడని మండలి ఉండి ఏమి ప్రయోజనం? సభ్యులందరూ ఆలోచించాలంటూ తన మనసులో మాటను స్పష్టంగానే చెప్పారు. దీనిపై చర్చించేందుకు సోమవారం శాసనసభ సమావేశాలు కొనసాగించవలసిందిగా స్పీకరును కోరారు. 

సోమవారం ఉదయం 9.30 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించి, అది ముగిసిన వెంటనే ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశంలో పాల్గొననున్నారు. కనుక మండలి రద్దు బిల్లుకు ఆమోదముద్రవేయడానికే జగన్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం, శాసనసభ నిర్వహిస్తున్నట్లు భావించవచ్చు. 

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వం తీసుకొన్న చాలా నిర్ణయాలను పునః సమీక్షించింది. చాలావాటిని రద్దు చేసింది. రాజధానిని మూడు ముక్కలు చేసి విశాఖకు తరలించడమే చాలా వివాదాస్పదమనుకొంటే, ఇప్పుడు ఏకంగా మండలినే రద్దు చేసేందుకు సిద్దమవుతుండటం విశేషం.

 శాసనసభ ఆమోదించిన బిల్లులను మండలిలో ఆమోదించాలనే నియమం ఏమీ లేదు. శాసనసభలో వైసీపీకి మెజార్టీ ఉన్నందున అది ఏవిధంగా అన్ని బిల్లులను ఆమోదింపజేసుకొంటోందో, అదేవిధంగా శాసనమండలిలో మెజార్టీ ఉన్నకారణంగా టిడిపి ఆ బిల్లులను అడ్డుకొంటోందని అర్ధమవుతోంది. కానీ జగన్ దానిని రాజకీయం చేయడంగా...  అవమానంగా భావించి ఏకంగా మండలినే రద్దు చేయాలనుకొంటే చేజేతులా మరో సమస్యను ఆహ్వానించినట్లే అవుతుంది. వైసీపీ ప్రభుత్వం పరిపాలనపై, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరచడంపై దృష్టి పెట్టకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వం నిర్ణయాలను రద్దు చేస్తూ...చేజేతులా సమస్యలు సృష్టించుకోవడం చాలా ఆశ్చర్యకరమే. చివరికి ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.


Related Post