జూపల్లిపై వేటు పడనుందా?

January 24, 2020


img

మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ టికెట్లు ఆశించి భంగపడినవారిలో కొందరు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మాజీమంత్రి జూపల్లి కృష్ణరావు అనుచరులలో 20మందికి టిఆర్ఎస్‌ టికెట్లు నిరాకరించి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అనుచరులకు కేటాయించడంతో జూపల్లి తీవ్రఆగ్రహం చెందారు. దాంతో ఆయన తన అనుకహృలను పోటీగా నిలబెట్టడమే కాకుండా వారి తరపున స్వయంగా ప్రచారం కూడా చేశారు. దాంతో ఆ వార్డులలో ఒకేపార్టీకి చెందిన ఇద్దరేసి అభ్యర్ధులు రావడంతో వారిలో ఎవరికి ఓటేయాలో తెలియక ప్రజలు తికమకపడ్డారు. 

జూపల్లి కృష్ణారావుకు నచ్చజెప్పి ఆయన అనుచరులను ఉపసంహరించేందుకు టిఆర్ఎస్‌ ప్రయత్నించినప్పటికీ ఆయన ససేమిరా అనడంతో వారం రోజులు కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులలో రెండు వర్గాలు ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. పోలింగ్ పూర్తయింది కనుక వాతావరణం కాస్త చల్లబడిందనుకొంటే గురువారం రాత్రి ఇరువర్గాల మద్య మళ్ళీ ఘర్షణలు జరిగాయి. 

కొల్లాపూర్‌లో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్దకు ఇరువర్గాలు చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనుచరులు కరెంటులేని సమయంలో అక్కడ కాపలా ఉన్న పోలీసుల సాయంతో బ్యాలెట్ బాక్సులను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తుంటే వారిని అడ్డుకొన్నామని జూపల్లి వర్గీయులు చెపుతుంటే, కరెంటు లేని సమయంలో జూపల్లి వర్గీయులు స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళుతుండటం గమనించి వారిని అడ్డుకొన్నామని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనుచరులు చెపుతున్నారు. 

స్ట్రాంగ్ రూమ్ వద్ద ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి వారీనందరినీ అక్కడి నుంచి  తరిమేశారు. ఇరువర్గాల మద్య ఉద్రిక్తతలు నెలకొన్న కారణంగా కొల్లాపూర్‌ పట్టణంలో రేపు ఉదయం కౌంటింగ్ మొదలయ్యే వరకు పట్టణంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు. 

పార్టీపై తిరుగుబాటు చేసి ఎన్నికలలో పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నం చేసినందుకు ఫలితాలు వెలువడగానే జూపల్లి కృష్ణారావుపై వేటు వేయడం ఖాయమని భావించవచ్చు. 



Related Post