నిర్భయ దోషులకు చివరిరోజులు...నరకయాతనే

January 24, 2020


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయకేసులో నలుగురు దోషులు వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌(31), ముఖేష్‌ కుమార్‌ (32), పవన్‌(26)లకు ఫిబ్రవరి 1వతేదీ ఉదయం 6గంటలకు డిల్లీ, తీహార్ జైల్లో ఒకేసారి ఉరి  తీయనున్నారు. కనుక చివరి కోరిక ఏమైనా ఉందా?అని తీహార్ జైలు అధికారులు వారిని అడుగగా నలుగురూ సమాధానం ఈయలేదని తెలిపారు. ఉరిశిక్ష అమలుచేసేలోగా వారిని కలిసి మాట్లాడుకోవచ్చునని కుటుంబ సభ్యులకు జైలు అధికారులు వర్తమానం పంపించారు. 

తీహార్ జైల్లో 3వ నెంబర్ బ్లాకులో నలుగురిని వేర్వేరు గదులలో ఉంచి, 24 గంటలు ఇద్దరు పోలీసులు వారికి కాపలాగా ఉంటున్నారు. ఫిబ్రవరి 1న వారిని ఉరితీసిన తరువాత నలుగురు చనిపోయారని వైద్యులు దృవీకరించి, ఆ మేరకు దృవపత్రాలపై సంతకాలు చేసిన తరువాత జైలు అధికారులు లాంచనాలన్నీ పూర్తిచేసి వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. 

2012, డిసెంబర్ 16న రాత్రి దేశరాజధాని డిల్లీలో బస్సు కోసం ఎదురుచూస్తున్న నిర్భయ (వైద్యవిద్యార్ధిని)ను దోషులు బస్సులో ఎక్కించుకొని అతిదారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమెను చాలా దారుణంగా హింసించి రాక్షసానందం పొందారు. ఆమె సింగపూర్ ఆసుపత్రిలో పదిరోజులపాటు నరకయాతన అనుభవించి చనిపోయింది. అప్పటి నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. వారిలో ఒకరు తీహార్ జైల్లోనే ఉరివేసుకొని చనిపోగా, మరొకడు మైనర్ అయినందున మూడేళ్లు బాలనేరస్తులగృహంలో ఉంచి విడుదల చేశారు. 

అయితే రెండు నెలలో ముగిసిపోతుందనుకొన్న ఈ కేసు ఇన్నేళ్ళు కొనసాగడంతో ఉరిశిక్షను తప్పించుకోవచ్చునని వారిలో నమ్మకం ఏర్పడినట్లు జైలు సిబ్బంది చెప్పారు. కానీ ఇప్పుడు హటాత్తుగా మృత్యువు వారి కళ్లెదుటవచ్చి నిలబడటంతో నలుగురూ దిగులుగా కూర్చోన్నారు. వారు ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడటంలేదని జైలు సిబ్బంది చెపుతున్నారు. ఇక చావు తప్పదని తెలిసిన తరువాత జైలులో ఒంటరిగా కూర్చోంటే కలిగే మానసిక ఆందోళన వారు గత 7 ఏళ్లుగా అనుభవించిన జైలు శిక్షకంటే.. చివరికి ఉరిశిక్ష కంటే కూడా చాలా కటినమైనది. కనుక అంతవరకు ఈ భయం, మానసిక ఆందోళన భరించడమే వారికి అసలైన శిక్ష అని భావించవచ్చు.


Related Post