సీఏఏ నిరసనలు ప్రజల కోసమా...పార్టీల కోసమా?

January 24, 2020


img

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా దేశంలో చాలా రాజకీయ పార్టీలు నిరసన ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. అయితే వాటి వలన ప్రజలకు నష్టం కలుగుతుందనే ఆలోచనతోనే అవి  పోరాడుతున్నాయా లేక ఆ పేరుతో ఒక వర్గం ప్రజలను ఆకట్టుకొని రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే, సీఏఏ వలన దేశానికి, ఏ వర్గం ప్రజలకైనా నష్టం కలుగుతుందా లేదా అని అవి చర్చిస్తే దానిలో మంచిచెడు సామాన్యులకు కూడా అర్ధం అవుతుంది. కానీ సీఏఏను వ్యతిరేకిస్తున్న ఏ రాజకీయపార్టీ కూడా ఆ పని చేయకుండా సీఏఏతో దేశంలో ఒక వర్గం ప్రజలు తమ పౌరసత్వం కోల్పోతారని వాదిస్తూ వారిలో భయాందోళనలు సృష్టించి, వారికి ‘తాము మాత్రమే’ అండగా నిలబడతామని చెప్పుకొని వారి ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

అయితే కేంద్రప్రభుత్వం సీఏఏతో ప్రజల మద్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న పార్టీలు కూడా అదే సీఏఏతో ప్రజల మద్య చిచ్చుపెట్టాలనుకోవడమే విడ్డూరం. ఒకవేళ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తున్న పార్టీలు వాటి వలన నిజంగా ప్రజలకు అపకారం కలుగుతుందని బలంగా నమ్ముతున్నట్లయితే, అది ఏవిధంగా జరిగే అవకాశం ఉందో తమ సభలు, సమావేశాలలో వివరించి ప్రజలను చైతన్యపరిచాలి తప్ప ర్యాలీలు, సభల ద్వారా బలప్రదర్శన చేస్తూ రాజకీయంగా బలపడాలని, తమ ప్రత్యర్ది పార్టీలపై పైచేయి సాధించాలని ప్రయత్నించడం సరికాదు.


Related Post