బాబూమోహన్ స్టైల్ ఇంకా మారినట్లు లేదే!

January 23, 2020


img

బాబూమోహన్ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని అధికారులతో, టిఆర్ఎస్‌ నేతలతో దురుసుగా వ్యవహరిస్తుండటం చేత 2018 ముందస్తు ఎన్నికలలో సిఎం కేసీఆర్‌ ఆయనను పక్కన పెట్టి క్రాంతి కిరణ్‌కు ఇచ్చారు. దాంతో బాబూమోహన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిజెపిలో చేరి మళ్ళీ ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి క్రాంతి కిరణ్‌ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి బాబూమోహన్ పేరు వినబడలేదు. మళ్ళీ చాలా రోజుల తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై చిందులు వేశారు.

“క్రాంతి కిరణ్‌ కారు కింద పడుకొని బ్రతికే కుక్కపిల్లవంటివాడు. కేసీఆర్‌ పుణ్యామని హటాత్తుగా ఎమ్మెల్యే అయిపోయాడు. ఎమ్మెల్యే అయినప్పటికీ ఆందోల్ నియోజకవర్గం అభివృద్ధికి చేసిందేమీలేదు..కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడం తప్ప. అటువంటి వ్యక్తి నిష్కళంకమైన రాజకీయ జీవితం కలిగిన నా గురించి అవాకులు చవాకులు వాగుతున్నాడు. అతనో రాజకీయ అజ్ఞాని. ఎమ్మెల్యేననే అహంకారంతో విర్రవీగడం కాదు...దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసివస్తే ఇద్దరం ఇండిపెండెంట్లుగా పోటీ చేద్దాం. ఒకవేళ ప్రజలు మళ్ళీ అతనినే ఎన్నుకొంటే నేను మళ్ళీ ఆందోల్‌లో అడుగుపెట్టను,” అని సవాల్ విసిరారు. 

తన సీటును క్రాంతి కిరణ్ దక్కించుకొన్నందున బాబూమోహన్ అసూయ చెందడం సహజమే. కానీ జరిగిపోయిన దానిని పట్టుకొని ఇంకా ఈవిధంగా అక్కసు వెళ్ళగక్కుతుంటే ప్రజలలో ఇంకా పలుచనవుతారని మరిచిపోకూడదు. ఒకవేళ ఆందోల్ ప్రజలు తనవైపే ఉన్నారని బాబూమోహన్ భావిస్తున్నట్లయితే, మునిసిపల్ ఎన్నికలలో బిజెపి అభ్యర్ధులను నిలబెట్టి వారిని గెలిపించుకొని చూపిస్తే ఆయన సత్తా అందరికీ తెలిసేది కదా?


Related Post