కాంగ్రెస్‌, బిజెపిలు ముందే ఓటమిని అంగీకరించేశాయా?

January 23, 2020


img

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిల పరిస్థితులను బట్టి చూస్తే మునిసిపల్ ఎన్నికలలో ఆ రెండూ టిఆర్ఎస్‌ చేతిలో ఓడిపోవడం ఖాయమని ముందే స్పష్టమైంది. ఈసారి అవి రాష్ట్రంలో అన్ని స్థానాలకు నామినేషన్లు వేయలేకపోవడంతో అవి టిఆర్ఎస్‌కు పోటీ కూడా ఇవ్వలేవని స్పష్టమైంది. 

పోలింగ్ ముగియగానే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇద్దరూ టిఆర్ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, బారీగా డబ్బు, మద్యం పంపిణీ చేసిందని, దొంగ ఓట్లు వేయించిందని, ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులను పోలీసులు వేధించారని అనేక ఆరోపణలు చేశారు. అంటే కాంగ్రెస్‌, బిజెపిలు ఫలితాలు రాక మునుపే తమ ఓటమిని అంగీకరించేసినట్లు భావించవచ్చు. రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థను, ఎన్నికల తీరును టిఆర్ఎస్‌ పూర్తిగా భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. అయినప్పటికీ టిఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చామని, గతంలో కంటే ఈసారి ఎక్కువ ఓట్లు, సీట్లు వస్తాయని చెప్పుకొన్నారు. ఈ ఎన్నికలలో ఆ రెండు పార్టీలు అన్ని స్థానాలకు పోటీ చేయలేదు కనుక టిఆర్ఎస్‌ను ఓడించే ప్రసక్తే లేదు. కనీసం అవి పోటీ చేసినచోట గౌరవప్రదమైన స్థానాలనైనా గెలుచుకోగలిగితే గొప్ప విషయమే అవుతుంది. 

కానీ ఆ రెండు పార్టీలు ఒకటి గమనించాల్సి ఉంది. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా పరిస్థితులు ఇలాగే ఉంటాయి. కనుక ఇటువంటి పరిస్థితులలోనే కాంగ్రెస్‌, బిజెపిలు టిఆర్ఎస్‌ను ఓడించగలిగితేనే రాష్ట్రంలో ఎప్పటికైనా అధికారం చేజిక్కించుకోగలవు లేకుంటే ప్రతీ ఎన్నికల తరువాత మరింత బలహీనపడుతూ చివరికి రాష్ట్రంలో నుంచి అదృశ్యమైపోవచ్చునని ఆ రెండు పార్టీలు తెలుసుకోవలసి ఉంది. 


Related Post