ట్రంప్ నోట మళ్ళీ అదేపాట

January 23, 2020


img



అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు, తీరు, నిర్ణయాలు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటాయని అందరికీ తెలుసు. అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ళలోనే ఉత్తర కొరియా, ఇరాన్, ఇరాక్‌ దేశాలతో పేచీలు పెట్టుకొని దాదాపు ప్రత్యక్షయుద్ధం జరిగే పరిస్థితులు కల్పించారు. అలాగే భారత్‌, చైనాలతో వాణిజ్యపరమైన యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. గతంలో అమెరికా అధ్యక్షులుగా చేసినవారు చాలా హుందాగా వ్యవహరించేవారు. కానీ ట్రంప్ నోటికి ఎంతోస్తే అంత అనేస్తుంటారు. 

ఇక ఆయన విదేశీవిధానం ఎవరికీ అర్ధం కాదు. ఓసారి భారత్‌ మాకు మిత్రదేశం అంటారు. వెంటనే పాక్‌ అంతకంటే మాకు ముఖ్యమని అంటారు. భారత్‌-పాక్‌ వ్యవహారాలలో వేలు పెట్టవద్దని భారత్‌ పదేపదే చెపుతున్నప్పటికీ, ‘కశ్మీర్ సమస్యను నేనే చొరవ తీసుకొని పరిష్కరిస్తానంటూ’ ప్రకటనలు చేస్తుంటారు. 

తాజాగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సుకు హాజరైన ట్రంప్ అక్కడ పాక్‌ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశమైన తరువాత మళ్ళీ అదే పాట పాడారు. కశ్మీర్ సమస్య గురించి తనకు మంచి అవగాహన ఉందని, ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయపడతానని ట్రంప్ అన్నారు. 

అసలు కశ్మీర్‌ విషయంలో పాక్‌ పాలకులకు స్పష్టమైన వైఖరి ఉందో లేదో అర్ధం కాదు. ఎందుకంటే, భారత్‌ అధీనంలో ఉన్న కశ్మీర్‌కు స్వేచ్చాస్వాతంత్ర్యాలు కావాలని పాక్‌ డిమాండ్ చేస్తోంది. అంటే దానిని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని కోరుకొంటోందా లేక దానిని కూడా పాకిస్థాన్‌లో కలిపేసుకోవాలనుకొంటోందా లేక పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్ ను విడదీసినందుకు భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే కశ్మీర్‌ను ఒక సమస్యగా మార్చి భారత్‌ను వేధించాలనుకుంటోందా?అనేది తెలియదు. పాక్‌ అధీనంలో ఉన్న కశ్మీర్‌లో దయనీయమైన జీవితాలు గడుపుతున్న ప్రజలు తమ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయాలని కోరుకొంటుంటే, భారత్‌ అధీనంలో ఉన్న కశ్మీర్‌ గురించి పాక్‌ మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉంది. 

కశ్మీర్ అంశాన్ని ఓ అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలని పాక్‌ విఫలయత్నాలు చేస్తుంటే, పాక్‌ ఉగ్రవాదం గురించి తెలిసి ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానికి వత్తాసు పలకడం విస్మయం కలిగిస్తోంది. ఏదైనా తనదాక వస్తే కానీ తెలియదంటారు పెద్దలు. అమెరికాకు కూడా అంతే.


Related Post