కేసీఆర్‌ సర్కారుకు అగ్నిపరీక్షలు పెడుతున్న మజ్లీస్

January 23, 2020


img

మజ్లీస్ పార్టీ, యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీల అధ్వర్యంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ ర్యాలీ, అనంతరం బహిరంగసభ నిర్వహించడానికి సిద్దం అవుతోంది. అంతకు ముందు జనవరి 10న కూడా అవి సీఏఏకు వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహించాయి. హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పరిమిత సంఖ్యలో సభ జరుపుకోవాలని పోలీసులు అనుమతించినప్పటికీ, ఆరోజున వేలాదిమంది ఆందోళనకారులు ర్యాలీలో పాల్గొన్నారు. దాంతో నగరంలో ట్రాఫిక్ జామ్‌ కూడా అయ్యింది. గడువు దాటిన తరువాత సభ కూడా నిర్వహించారు. దానిలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. 

సీఏఏను టిఆర్ఎస్‌ కూడా పార్లమెంటులో వ్యతిరేకించింది కానీ అధికారంలో ఉన్నందున ఆందోళనలు చేయలేదు. చేస్తే ప్రభుత్వానికే ఇబ్బంది కలుగుతుంది కనుక మిత్రపక్షమైన మజ్లీస్‌ పోరాటాలకు సంఘీభావం తెలిపింది. కానీ హైదరాబాద్‌ నగరంలో మజ్లీస్ నిర్వహిస్తున్న ఈ ర్యాలీలు, బహిరంగసభలు తెరాస సర్కార్‌కు క్రమంగా ఇబ్బందికరంగా మారుతున్నాయని చెప్పకతప్పదు. 

తెలంగాణ ఏర్పడి రాష్ట్రంలో టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌ నగరంలో చాలా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. పైగా ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తుండటంతో దేశవిదేశాలకు చెందిన పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఐ‌టి కంపెనీలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయి. దాంతో హైదరాబాద్‌ బ్రాండ్ వాల్యూ కూడా పెరిగి, దేశంలో నెంబర్ 1 నగరంగా నిలుస్తోంది. 

నగరంలో ఇటువంటి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉన్నప్పుడు, మజ్లీస్ పార్టీ చేస్తున్న ఈ ఆందోళనలు, ర్యాలీలు, బహిరంగసభలతో హైదరాబాద్‌ బ్రాండ్ వాల్యూ దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న తెరాస సర్కార్‌కు ఇవి చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి. కనుక సిఎం కేసీఆర్‌ మజ్లీస్ పార్టీకి ఏవిధంగా నచ్చజెపుతారో చూడాలి.


Related Post