జగన్ సర్కారుకు మండలి ఛైర్మన్ షాక్

January 25, 2020


img

జగన్ సర్కారుకు శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఊహించనివిదంగా పెద్ద షాక్ ఇచ్చారు. వైసీపీకి శాసనసభలో పూర్తి మెజార్టీ ఉన్నందున అధికార వికేంద్రీకరణ బిల్లు (మూడు రాజధానుల బిల్లు), సీఆర్‌డీఏను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లులకు శాసనసభలో ఆమోదముద్ర వేయించుకోగలిగింది. కానీ శాసనమండలిలో ప్రతిపక్ష టిడిపి సభ్యులకే బలం ఎక్కువ ఉండటంతో వారు ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని పట్టుబట్టారు. ఒకవేళ సెలెక్ట్ కమిటీకి బిల్లులను పంపించినట్లయితే అది చర్చించి నిర్ణయం తీసుకొనేందుకు కనీసం మూడు నెలలు పడుతుంది. అంతవరకు జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదనను తక్షణం అమలుచేయలేని పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక నిబందనల ప్రకారం ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించరాదని వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు మండలిలో గట్టిగా వాదించారు.

ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు మండలిలో దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య దీనిపై తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ రాత్రి 8.34 గంటలకు రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అది విని సభలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు కాసేపు షాక్ అయ్యారు. అనంతరం అందరూ కలిసి ఆయనను దూషించడం మొదలుపెట్టారు. అప్పుడు టిడిపి ఎమ్మెల్సీలు ఆయనకు రక్షణగా నిలబడి బయటకు తీసుకువెళ్లారు. 

ఆ బిల్లులపై టిడిపి సభ్యులు ఇచ్చిన సవరణ నోటీసులు సకాలంలో అందనందున, మండలి ఛైర్మన్ తమను కాదని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తారని ఊహించని వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు ఆయన నిర్ణయాన్ని విని షాక్ అయ్యారు. నిబందనల ప్రకారం టిడిపి నోటీసులను పక్కన పెట్టే అవకాశమున్నప్పటికీ తన విచక్షణాధికారంతో వాటిని సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయించినట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించడం వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులకు ఇంకా ఆగ్రహం కలిగించింది.  

మండలిలో వైసీపీకి బలం లేదు. పైగా శాసనమండలి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎంఏ షరీఫ్ టిడిపిలో సీనియర్ నాయకుడు. కనుక ఇటువంటి పరిణామం ఎదురవుతుందని వైసీపీ ముందే ఊహించి ఉండాలి. కాని చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంటోందిప్పుడు. కీలకమైన రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపించడంతో టిడిపిలో విజయోత్సాహం, వైసీపీలో ఓడిపోయామనే ఆవేశం కనిపిస్తోంది. కనుక ఇప్పుడు వాటిని అమలుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


Related Post