సీఏఏతో మజ్లీస్ రాజకీయాలు

January 23, 2020


img

కేంద్రప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలుచేస్తామని చెపుతోంది. ఎట్టి పరిస్థితులలో దానిని అడ్డుకొంటామని ప్రతిపక్షాలు చెపుతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు, ప్రచారం కారణంగా ప్రజలలో అపోహలు, అనుమానాలు, భయాలు ఏర్పడుతున్నాయని గుర్తించిన కేంద్రప్రభుత్వం వాటిని తొలగించేందుకు దేశవ్యాప్తంగా సీఏఏ అవగాహన సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. వాటిలో భాగంగానే కేంద్రహోంమంత్రి అమిత్ షా మంగళవారం లక్నోలో సభ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై ప్రతిపక్షాల వైఖరిని తప్పు పడుతూ రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్‌లలో ఎవరైనా దానిపై తనతో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. 

అయితే వారికంటే ముందుగా మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. అయితే ఆయన దీనిని కరీంనగర్‌ మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడంతో ఈ అంశంతో ఆయన ముస్లిం ఓటర్లను ప్రభావితం చేసి ఓట్లు రాబట్టుకోవాలని ఆశపడుతున్నట్లు అర్ధమవుతోంది. 

ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, “మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతం ప్రాతిపదికన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను తెచ్చి దేశంలో ముస్లింలపట్ల వివక్ష చూపుతోంది. దీనిని మేము గట్టిగా వ్యతిరేకిస్తాము. అమిత్ షా చర్చించాల్సింది వారితో కాదు నాతో. ఇప్పుడు చర్చ జరగాల్సింది గడ్డం ఉన్న ముస్లింతోనే తప్ప వారితో చర్చించి ప్రయోజనం లేదు. నేను ఇక్కడే ఉన్నాను. దమ్ముంటే వచ్చి నాతో చర్చించండి,” అని అసదుద్దీన్ ఓవైసీ కేంద్రహోంమంత్రి అమిత్ షాకు సవాలు విసిరారు.


Related Post