టిపిసిసి కొత్త అధ్యక్షుడు ఎవరో?

January 17, 2020


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మునిసిపల్ ఎన్నికల తరువాత తప్పుకోనుండటంతో ఆయన స్థానంలో ఎవరిని నియమించబోతోందనే ఉత్కంట ఆ పార్టీ శ్రేణులలో నెలకొంది. పిసిసి అధ్యక్ష పదవికి రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, సంపత్ కుమార్ రేసులో ఉన్నారు. కానీ వారిలో రేవంత్‌ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క పేర్లే అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

అయితే చిరకాలంగా పార్టీకి సేవ చేస్తున్న తనకే అవకాశం ఇవ్వాలని వి.హనుమంతరావు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడూ రెడ్డి సామాజికవర్గానికే కీలకపదవులు కట్టబెడుతున్నందున పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని కనుక ఈసారి తనకే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, రాష్ట్రంలో బీసీలందరినీ కలుపుకొని 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తానని వి.హనుమంతరావు చెపుతున్నారు. అయితే ఆయనకు వయసు మీరడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనను పక్కన పెట్టిన్నట్లు తెలుస్తోంది. 

తెరాసను ఎదుర్కొని డ్డీకొనగల సమర్దుడైన వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నందున రేవంత్‌ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్కలలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. అయితే ఎవరికి కాంగ్రెస్‌ కిరీటం లభించినప్పటికీ అది వారికి ముళ్ళ కిరీటమే అవుతుంది తప్ప వరం కాబోదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అన్నిటికంటే ముందుగా అధ్యక్ష పదవి దక్కనివారితో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. తరువాత పార్టీ పరిస్థితి చూసి నిరాశానిస్పృహలలో కూరుకుపోయున్న సీనియర్లను తట్టి నిద్రలేపి మళ్ళీ వారిలో కదలిక తీసుకురావలాసీ ఉంటుంది. ఒకపక్క తెరాస ఒత్తిళ్లను ఎదుర్కొంటూ నిలబడి పోరాడుతూనే మరోపక్క రాష్ట్రంలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొని ప్రజల విశ్వాసాన్ని పొందవలసి ఉంటుంది. కనుక పిసిసి అధ్యక్ష పదవి చేపట్టబోయే వ్యక్తి అనేక సమస్యలు, సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటన్నిటినీ అధిగమించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగితే అతను నిజంగానే గొప్ప నాయకుడని అంగీకరించవలసిందే. కానీ కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్‌ను కొట్టగల బాహుబలి ఉన్నాడా?


Related Post