కె.లక్ష్మణ్‌ వాదన బాగానే ఉంది కానీ...

January 17, 2020


img

మునిసిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, తెరాస, కాంగ్రెస్‌ పార్టీలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ్ళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియను పూర్తిగా మార్చేసింది. అవినీతి సొమ్ముతో ఎన్నికలను శాశించే సరికొత్త విధానంతో తెరాస నెగ్గుకువస్తోంది. ఇప్పుడూ అదేవిధంగా ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే, ఫలితాలు వెలువడ్డాక గెలిచినవారు తెరాసలో చేరిపోవడం ఖాయం. ఒకవేళ తెరాసకు ఓట్లు వేసి గెలిపిస్తే అది మజ్లీస్ కనుసన్నలలోనే పనిచేస్తుంది. కనుక బిజెపి అభ్యర్ధులను గెలిపిస్తే మేము కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను చక్కగా అభివృద్ధి చేస్తాము,” అని అన్నారు.

తెరాస, కాంగ్రెస్‌ పార్టీల విషయంలో కె.లక్ష్మణ్‌ వాదనలు బాగానే ఉన్నప్పటికీ, వాటితో ప్రజలను మెప్పించడం కష్టమేనని బహుశః ఆయనకు తెలిసే ఉంటుంది. మునిసిపల్ ఎన్నికలలో బిజెపిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని చెపుతున్న కె.లక్ష్మణ్‌, గత ఆరేళ్ళలో కేంద్రం నుంచి ఎన్ని నిధులు మంజూరు చేయించుకొచ్చారో చెపితే బాగుండేది. ఒకవేళ చేయించి ఉండి ఉంటే, కేంద్రం నుంచి రావలసిన నిధుల కోసం సిఎం కేసీఆర్‌ మొదలు తెరాస ఎంపీలు, అధికారులు డిల్లీలో ఎందుకు తిరగవలసి వస్తోంది? అనే ప్రశ్నకు కె.లక్ష్మణ్‌ సమాధానం చెప్పవలసి ఉంటుంది.  

నలుగురు బిజెపి ఎంపీలు రాష్ట్రానికి నిధులు సాధించుకొని రాలేకపోయినా కనీసం రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో గట్టిగా మాట్లాడలేకపోయారు. కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు పార్లమెంటు సమావేశాలలో తెరాస సర్కార్‌పై పిర్యాదులకే పరిమితంకాగా, తెరాస ఎంపీలు మాత్రం రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులోపలా బయటా కూడా చాలా గట్టిగానే ప్రయత్నించారని చెప్పవచ్చు. కనుక మునిసిపల్ ఎన్నికలలో తెరాసను ఎదుర్కొనేందుకు కె.లక్ష్మణ్‌ వేరే ఏదైనా అంశంపై మాట్లాడితే బాగుంటుందేమో?


Related Post