ఆ రెండూ తప్ప తెరాసకు అన్ని ప్లస్సే...

January 17, 2020


img

మునిసిపల్ ఎన్నికలలో కూడా తెరాస ఘనవిజయం సాధించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే, రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటం, అభివృద్ధి, సంక్షేమ పధకాల పట్ల మెజార్టీ ప్రజలు సంతృప్తిగా ఉండటం, అన్నిటికీ మించి ఎన్నికల వ్యూహాలను అమలుచేయడంలో తెరాసకున్న ప్రత్యేకమైన నేర్పు వంటివి చెప్పుకోవచ్చు. కానీ తెరాసను వేలెత్తి చూపేందుకు ప్రతిపక్షాల చేతిలో ఇంకా రెండు బలమైన అస్త్రాలున్నాయి. 1. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలుచేయకపోవడం. 2. మజ్లీస్ పార్టీతో దోస్తీ. 

నిరుద్యోగ భృతి, పంట రుణాల మాఫీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు వంటి కొన్ని హామీలను తెరాస సర్కార్‌ పూర్తిగా మరిచిపోయినట్లే ఉంది. ఈ అంశాలపై ప్రతిపక్షాల విమర్శలకు తెరాస వద్ద సమాధానమే లేదు కనుక తెరాస నేతలు తమ ఎన్నికల ప్రచారంలో ఆ ప్రస్తావన చేయకుండా జాగ్రత్తపడుతున్నారు. 

ఇక మజ్లీస్‌తో దోస్తీని తెరాస ఎన్నడూ రహస్యంగా దాచిపెట్టలేదు. కనుక తమ దోస్తీ గుర్తించి ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగానే జవాబు చెప్పగలుగుతోంది. అయితే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై మజ్లీస్‌ వాదనలు, పోరాటాలు తెరాసకు ఆమోదమేనా...కాదా? అనే ప్రశ్నకు తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సహా తెరాస నేతలెవరూ సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. సరిగ్గా ఈ బలహీనతనే ప్రతిపక్షాలు ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయి.         

ఈ రెండూ తప్ప తెరాసను గట్టిగా విమర్శించడానికి కాంగ్రెస్‌, బిజెపిల వద్ద బలమైన అంశాలే లేవనే చెప్పవచ్చు. ఎందుకంటే, గత ప్రభుత్వాలలో అభివృద్ధి కాగితాలకే పరిమితమయ్యుండేది కానీ తెలంగాణ ఏర్పడి రాష్ట్రంలో తెరాస సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టి ఖచ్చితంగా అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. గత ఆరేళ్ళలో రాష్ట్రంలో అభివృద్ధి కళ్ళకు కనబడుతోంది. కనుక ఆ విషయంలో కాంగ్రెస్‌, బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణలలో బలం లేదనే చెప్పవచ్చు. 

ఆర్ధిక సమస్యల కారణంగా  రైతుబంధు పధకం అమలులో ఆలస్యం జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆసరా పింఛన్లను మాత్రం సకాలంలో చెల్లిస్తుండటంతో ప్రజలు తెరాసపట్ల సానుకూలంగానే  ఉన్నారని చెప్పవచ్చు. కనుక మునిసిపల్ ఎన్నికలలో తెరాస అవలీలగానే విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్‌ ద్వితీయస్థానానికి, బిజెపి 3 లేదా 4 వ స్థానానికి పరిమితం కావచ్చు. 


Related Post