తెరాసకు జూపల్లి షాక్...

January 17, 2020


img

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెరాస అధిష్టానానికి షాక్ ఇస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలలో ఆయన అనుచరులను కాదని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనుచరులకు టికెట్స్ కేటాయించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన, కొల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలో 20 వార్డులలో తన అనుచరులను రెబెల్ అభ్యర్ధులుగా బరిలో నిలపడమే కాకుండా వారి తరపున స్వయంగా ఎన్నికల ప్రచారం కూడా చేస్తుండటంతో తెరాసలో కలకలం మొదలైంది. ఈసారి మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిల నుంచి గట్టి పోటీ లేకపోవడంతో అవలీలగా అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో గోలాబీ జెండా ఎగురవేయాలని తెరాస ఆశపడుతుంటే, సొంతపార్టీలో నేతలే రెబెల్ అభ్యర్ధులను నిలబెట్టి పార్టీ అభ్యర్ధులను ఓడించేందుకు ప్రయత్నిస్తుండటంతో తెరాస అధిష్టానం రంగంలో దిగింది. కొల్లాపూర్‌లో తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించడానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పంపించింది.

పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు జూపల్లి వంటి అనేకమంది మంత్రిపదవులు లభించాయి. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో చాలా ప్రాధాన్యత పొందారు. కానీ తెరాస రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు జూపల్లి, నాయిని, పద్మా దేవేందర్ రెడ్డి వంటి అనేకమంది సీనియర్లను పక్కన పెట్టి వేరే పార్టీలలో నుంచి తెరాసలోకి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితారెడ్డి వంటి వారికి సిఎం కేసీఆర్‌ చాలా ప్రాధాన్యం ఇస్తుండటంతో పార్టీలో సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలలో వారి అనుచరులను కూడా పక్కనపెట్టడంతో జూపల్లివంటి సీనియర్లకు ఆగ్రహం కలగడం సహజమే. కనుక పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జూపల్లి కృష్ణారావును తెరాస ఒప్పించగలదో లేదో అనుమానమే.


Related Post