కేటీఆర్‌, ఉత్తమ్‌..ఇద్దరికీ ప్రతిష్టాత్మకమే కానీ...

January 16, 2020


img

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 22న మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయి. 25న వాటి ఫలితాలు వెలువడనున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా తెరాస, కాంగ్రెస్‌ మద్యనే ప్రధానంగా పోటీ ఉండబోతోందని ఇప్పటికే స్పష్టమైంది. ఈ ఎన్నికల తరువాత ఆ రెండు పార్టీలలో రెండు కీలకమార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన పదవి నుంచి తప్పుకొని తన కుమారుడు, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలనుకొంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పిసిసి అధ్యక్ష పదవికాలం ముగిసినందున ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలనుకొంటున్నారు. కనుక మునిసిపల్ ఎన్నికలలో ఎలాగైనా తమ పార్టీలను గెలిపించుకోవాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేటీఆర్‌ పట్టుదలగా ఉన్నారు. 

పదవిలో నుంచి తప్పుకోబోయే ముందు జరుగుతున్న ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని తన సత్తా చాటుకోగలిగితే గౌరవంగా ఉంటుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి భావిస్తుంటే, ఈ ఎన్నికలలో తెరాసను గెలిపించుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాలపై, పార్టీపై పూర్తి పట్టుసాధించగలిగానని నిరూపించుకొని కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపడితే గొప్పగా ఉంటుందని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. 

కనుక ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేటీఆర్‌ ఇద్దరికీ ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవే. అయితే ఎప్పటిలాగే ఈ ఎన్నికలలో కూడా తెరాస ధాటిని తట్టుకొని నిలబడటం కాంగ్రెస్ పార్టీకి కష్టంగానే ఉంది. పైగా పార్టీ ముఖ్యనేతలలో చాలా మంది వేర్వేరు కారణాల చేత ఈ ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారు. కానీ తెరాసలో అందరూ కలిసికట్టుగా చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. కనుక ఈ ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉంటాయో తేలికగానే ఊహించవచ్చు. అప్పుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మరోసారి పరాభవం, కేటీఆర్‌కు పట్టాభిషేకానికి ముందు కీర్తి ప్రతిష్టలు మరింత పెరగడం ఖాయంగానే కనిపిస్తోంది.


Related Post