కాంగ్రెస్‌ గూటికి చేరిన గడ్డం వినోద్

January 11, 2020


img

తెలంగాణ ఉద్యమ సమయంలో అంటే 2013లో ఆ పోరాటలలో పాల్గొనేందుకు గడ్డం వినోద్, వివేక్ సోదరులు తెరాసలో చేరారు. కానీ ఏడాది తిరగక మునుపే తెరాసలో ఇమడలేక మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరుకొన్నారు. మళ్ళీ 2016లో ఇద్దరూ తెరాసలోకి  ఫిరాయించారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికలలో, వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిఎం కేసీఆర్‌ వారిరువురినీ పక్కనపెట్టడంతో వివేక్ తెరాసను వీడి బిజెపిలో చేరారు. అప్పటి నుంచి తెరాసకు దూరంగా ఉంటున్న ఆయన సోదరుడు వినోద్ నేడు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా సమక్షంలో ఆయన మళ్ళీ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీతో నాకు 35 ఏళ్ళ అనుబందం ఉంది. కానీ కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాను. కాంగ్రెస్‌ గూటికి చేరుకోవడంతో మళ్ళీ నా సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతోంది. నా సోదరుడు బిజెపిలో చేరడం ఆయన వ్యక్తిగత విషయం. దానితో నాకు సంబందం లేదు. ఇకపై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను,” అని అన్నారు. 

పదవుల కోసమే ఇన్నిసార్లు పార్టీలు మారిన జి.వినోద్, మరో నాలుగేళ్ళ తరువాత జరిగే ఎన్నికల వరకు ఏ పదవీ లేకుండా పార్టీలో పనిచేయగలరా? అంటే అనుమానమే. కనుక పార్టీలో కాస్త కుదురుకొన్న తరువాత ఆయన కూడా పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడినా ఆశ్చర్యం లేదు.


Related Post