జనవరి 20న బాంబు పేల్చబోతున్న జగన్ సర్కార్

January 11, 2020


img

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడంతో అందుకు అనుగుణంగానే రెండు కమిటీలు నివేదికలు ఇచ్చాయి. వాటి నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేసేందుకు మళ్ళీ ఓ హైపవర్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే అది కూడా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే సలహాలు ఇస్తుందని వేరే చెప్పక్కరలేదు. కనుక ఈ కమిటీలు... వాటి నివేదికల పేరు చెప్పి ఆ ఆలోచనలను అమలుచేయడమే తరువాయి. ఇంకా ఆలస్యం చేస్తే రాజధాని రైతుల ఆందోళనలు రాష్ట్రమంతటా విస్తరించే ప్రమాదం ఉందని కనుక వీలైనంత త్వరగా రాజధాని తరలింపు ప్రక్రియను మొదలుపెట్టాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కనుక ఆ కార్యాచరణకు చట్టపరంగా ఆమోదముద్ర వేసేందుకు ఈనెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం కానుంది. ఆ తరువాత జనవరి 20న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అప్పటికే మంత్రివర్గం ఆమోదించిన కమిటీల నివేదికలపై శాసనసభలో లాంఛనంగా చర్చించి, మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయడంతో ఆ తంతు పూర్తవుతుంది. అంటే జనవరి 20న రాజధాని తరలిస్తున్నట్లు జగన్ సర్కార్ బాంబు పేల్చడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇంతకాలం రాజధాని తరలింపుపై అమరావతిలో ఎన్ని ఆందోళనలు జరుగుతున్నప్పటికీ మాట్లాడని  సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆ రోజున అసెంబ్లీలో స్వయంగా ఈవిషయం ప్రకటించే అవకాశం ఉంది.    

మూడు రాజధానుల ప్రతిపాదనకు అసెంబ్లీ చేత ఆమోదముద్ర వేయించుకోగానే అమరావతి నుంచి విశాఖకు సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే విశాఖలో సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సిద్దం అవుతున్నాయి. ఏప్రిల్ 6నాటికి విశాఖలో సచివాలయం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభం కావాలని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు తాజా సమాచారం.      

కొసమెరుపు: మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శనివారం ఉదయం గన్నావరం విమానాశ్రయం నుంచి హడావుడిగా డిల్లీకి బయలుదేరి వెళ్ళారు. అక్కడ కేంద్రహోంమంత్రి అమిత్ షా, వీలైతే ప్రధాని నరేంద్రమోడీలను కలిసి రాజధాని తరలింపును ఆపాలని కోరబోతున్నట్లు సమాచారం. 


Related Post