పార్టీల మనుగడ కోసమే సీఏఏపై రాజకీయాలు: లక్ష్మణ్

January 11, 2020


img

దేశంలో రాజకీయపార్టీలన్నీ తమ తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. ఇంకా విశేషమేమిటంటే, పార్లమెంటులో సీఏఏకు అనుకూలంగా ఓటేసిన టిడిపి, వైసీపీలు, వ్యతిరేకంగా ఓటేసిన తెరాస వంటి పార్టీలు కూడా ఇప్పుడు దానికి మద్దతుగా, వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు ఈ అంశాన్ని ‘ఓటు బ్యాంక్’ కోణంలో నుంచి చూస్తున్నందునే. సీఏఏకు అనుకూలంగా ఓటు వేసిన పార్టీలు కూడా మాట్లాడకపోవడంతో ఈ విషయంలో బిజెపి పూర్తిగా ఒంటరిదైపోయింది. అయితే దేశంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఆందోళనలతో బిజెపి కూడా రాజకీయంగా నష్టపోవచ్చునని గ్రహించడంతో దేశవ్యాప్తంగా సీఏఏపై అవగాహానా సదస్సులు నిర్వహిస్తోంది. 

శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సీఏఏపై అవగాహనా సదస్సులో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ, “గత ఆరేళ్ళలో ప్రధాని నరేంద్రమోడీ అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొన్నారు. దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్, అయోధ్య, ట్రిపుల్ తలాక్ మొదలైన సమస్యలను ప్రధాని నరేంద్రమోడీ పరిష్కరించడంతో కులమతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా యావత్ దేశప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఓ కులం, ఓ మతం లేదా ఓ ప్రాంతం ఆధారంగా ఏర్పాటైన కొన్ని రాజకీయ పార్టీలు సీఏఏకు మతం రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నాయి. తద్వారా ప్రధాని నరేంద్రమోడీ ప్రభంజనం నుంచి అవి తమను తాము కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ దేశ భద్రత, భవిష్యత్‌ల కోసం ప్రధాని నరేంద్రమోడీ తీసుకొన్న నిర్ణయాలను వ్యతిరేకించినట్లయితే ప్రజలకు దూరం అవుతాయి కనుక అవే ఇంకా నష్టపోతాయని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.


Related Post