తెరాసను డ్డీకొనడానికి కాంగ్రెస్‌ వద్ద ఆయుధాలు లేవా?

January 11, 2020


img

మున్సిపల్ ఎన్నికలు వచ్చేశాయి. గత ఆరేళ్ళలో తెరాస సర్కార్‌ రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందో చెప్పుకొని తెరాస నేతలు ఓట్లు అడుగగలుగుతున్నారు. అయితే రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ వద్ద ప్రజలను ఒప్పించి మెప్పించేందుకు ఏవీ ఉన్నట్లు కనబడటం లేదు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వింటే అది అర్ధమవుతుంది. 

ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “గత ఆరేళ్ళలో తెరాస సర్కార్ రాష్ట్రంలో ఒక్క మునిసిపాలిటీని కూడా అభివృద్ధి చేయలేదు. ఒక్క రోడ్డు కూడా రిపేరు చేయించలేదు. మిషన్ భగీరధ కోసం ఉన్న రోడ్లను కూడా తవ్వేయడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, పంటరుణాల మాఫీ వంటి హామీలను ఇంతవరకు అమలుచేయలేదు. ఇక సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై తెరాస, మజ్లీస్ పార్టీలు కలిసి డబుల్ గేమ్ ఆడుతున్నాయి. వాటిపై ఇంతవరకు తెరాస వైఖరి చెప్పనేలేదు. అయినా అసదుద్దీన్ ఓవైసీ నిలదీసి అడగడం లేదు. మాయమాటలు చెపుతూ ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్న తెరాసను మున్సిపల్ ఎన్నికలలో ఓడించి ప్రజలు బుద్ది చెప్పాలి,” అని అన్నారు.

కానీ గత ఆరేళ్ళలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలోను రోడ్లు, కాలువల నిర్మాణాలు భారీగా జరిగాయని అందరికీ తెలుసు. అలాగే మౌలిక వసతులు కల్పన, హరితహారం, పల్లెప్రగతి వంటి మంచి కార్యక్రమాలతో రాష్ట్రంలో గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల రూపురేఖలు మారుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి పధకాల వలన ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో నిరంతరం నీళ్ళు పారుతున్నాయి. దాంతో భూగర్భజలాలు పెరుగుతున్నాయి. పంటలు పండుతున్నాయి. వీటికి సమాంతరంగా రాష్ట్రంలో ఐ‌టి పార్కులు, టెక్స్‌టైల్‌ పార్క్, ఫార్మా సిటీలను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తుండటంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కూడా జోరందుకొంది. ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల కారణంగా దశాబ్ధాలుగా నిరాదరణకు గురైన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

తెలంగాణలో ఇటువంటి మార్పులనే ప్రజలు కూడా కోరుకొంటున్నారు కనుకనే రాజకీయంగా తెరాస వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ, కొన్ని హామీలను,పధకాలను అమలుచేయనప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదని చెప్పవచ్చు. అందుకే కాంగ్రెస్‌, బిజెపిలు ప్రజలను మెప్పించలేకపోతున్నాయని చెప్పవచ్చు. కనుక మున్సిపల్ ఎన్నికలలో తెరాసను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌, బిజెపిలు కొత్త అస్త్రాలు వెతుక్కోవలసి ఉంటుంది లేకుంటే తెరాస చేతిలో మరోసారి ఓటమి తప్పదు.


Related Post