దిశ కేసులో ఆవేశం ఇప్పుడు కనబడదేమీ?

January 10, 2020


img

దిశ హత్యాచారం జరిగినప్పుడు యావత్ రాష్ట్రం...దేశం స్పందించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, మీడియా,  పోలీస్ వ్యవస్థ, మానవ హక్కులు, మహిళా హక్కుల సంఘాలు అందరూ చాలా తీవ్రస్థాయిలో స్పందించారు. నిందితులను బహిరంగంగా రోడ్డుపై ఉరి తీయాల్సిందే...ఎన్‌కౌంటర్‌ చేయవలసిందే...అంటూ యావత్ దేశప్రజలు ఒక్క గొంతుతో కోరారు. తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు. అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తరువాత రాష్ట్రంలో...దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆగిపోలేదు. నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు. కనుక అవి మీడియాలో రోజువారీ వార్తలుగా మిగిలిపోయి కనుమరుగైపోతున్నాయి. 

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఓ అత్యాచారం అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌లో మోడల్‌గా పనిచేస్తున్న ఒక యువతిని ఇద్దరు యువకులు బలవంతంగా మద్యం త్రాగించి అత్యాచారం చేశారు. దానిని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు కూడా. ఈ ఘటనపై ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు, ఆ రోజు రాత్రి దిశ తల్లితండ్రులకు ఎదురైన అవమానాలే ఎదురయ్యాయి. ఈ ఘటన గత నెల 28న జరిగితే నేటి వరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి తీవ్రమైన నేరాలపై కటినంగా వ్యవహరిస్తామని ఆనాడు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పిన మాటలు ఏమయ్యాయో తెలీదు కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి మీడియాకు చెప్పుకోవలసి వచ్చింది. కనీసం ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తే బాగుంటుంది.


Related Post