తెరాస మాట్లాడవలసిన సమయం వచ్చింది

January 10, 2020


img

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తూ నేడు హైదరాబాద్‌లో భారీ ర్యాలీ జరుగుతోంది. అనంతరం శాస్త్రీపురం వద్ద సాయంత్రం 5 గంటలకు బహిరంగసభ కూడా జరుగుతుంది. ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ అధ్వర్యంలో జరుగుబోయే ఆ బహిరంగసభలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ప్రసంగించనున్నారు.

ఈ ర్యాలీతో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై మజ్లీస్ పార్టీ తన వైఖరిని మరోసారి చాటి చెప్పుకొన్నట్లవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వాటిని వ్యతిరేకిస్తున్నప్పటికీ దాని ర్యాలీలు, సభలకు తెరాస సర్కార్‌ అనుమతించడం లేదు. దాంతో వాటిపై  తెరాస వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ నిలదీస్తోంది.

ముస్లింల ర్యాలీని అనుమతించడం ద్వారా తెరాస సీఏఏకు వ్యతిరేకమని సంకేతం ఇచ్చినట్లవుతుంది కనుక అది బిజెపికి కూడా ఆగ్రహం కలిగించవచ్చు. ఒకపక్క తాము సీఏఏ అవగాహనార్యాలీలు నిర్వహించి దానిపై ప్రజలలో నెలకొన్న అపోహలను, అనుమానాలను, భయాలను తొలగించే ప్రయత్నం చేస్తుంటే, మరోపక్క తెరాస సర్కార్‌ సీఏఏ వ్యతిరేక ర్యాలీలు, బహిరంగసభల నిర్వహణకు మజ్లీస్ పార్టీని అనుమతిస్తున్నందుకు బిజెపికి ఆగ్రహం కలుగవచ్చు.

కనుక ఈరోజు జరుగుతున్న ర్యాలీ, బహిరంగసభలతో తెరాసపై ఒత్తిడి పెరుగవచ్చు. అది కూడా సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేసింది కానీ సిఎం కేసీఆర్‌తో సహా తెరాస నేతలెవరూ కూడా ఇంతవరకు దానిని వ్యతిరేకిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనుక వాటిపై తెరాస మాట్లాడవలసిన సమయం దగ్గర పడినట్లే భావించవచ్చు. కానీ మున్సిపల్ ఎన్నికల తరువాతే వాటిపై సిఎం కేసీఆర్‌ తెరాస వైఖరిని ప్రకటించవచ్చు.


Related Post