ఆ విమానం కూలిపోయిందా…కూల్చేశారా?

January 10, 2020


img

ఇరాన్‌-అమెరికా మద్య మొదలైన ఘర్షణలో అమెరికా అనూహ్యంగా వెనక్కు తగ్గడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం సంతోషకరమైన వార్త కాగా, మొన్న బుదవారం బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఉక్రెయిన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం కూలిపోవడం చాలా విషాదఘటనగా మారింది. ఆ ప్రమాదంలో విమాన సిబ్బందితో సహా విమానంలో ఉన్న మొత్తం 178 మంది మరణించారు. అంతకంటే దారుణమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

ఆ విమానం సాంకేతికలోపం కారణంగా కాక, క్షిపణిదాడి వలన కూలిపోయినట్లు తాజా సమాచారం. దానికి సబందించి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. సరిగ్గా విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఒక క్షిపణి దానిని డ్డీకొన్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ సమయంలో ఇరాన్‌-అమెరికాల మద్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉండటంతో, దానిని అమెరికా విమానంగా భావించి ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బహుశః అందుకే ఇరాన్‌ ప్రభుత్వం ఆ విమానం తాలూకు బ్లాక్ బాక్సులను బోయింగ్ కంపెనీకి ఇవ్వడానికి నిరాకరిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. 


అమెరికా దళాలే ఆ విమానాన్ని కూల్చివేసి ఉండవచ్చునని మొదట వాదించిన ఇరాన్‌, ఇప్పుడు తమ భూభాగం నుంచే ప్రయోగించిన క్షిపణితో ఆ విమానం కూలిపోయినట్లు ఆధారాలు చూపుతున్న ఆ వీడియో బయటపడటంతో  చాలా చిక్కులో పడింది. 

చనిపోయినవారిలో 63 మంది కెనడా దేశస్థులు కావడంతో ఈ ఘటనపై సంజాయిషీ ఇవ్వాలని కెనడా ప్రభుత్వం ఇరాన్‌ ప్రభుత్వాన్ని కోరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, “ఈ ప్రమాదంపై మాకూ అనేక అనుమానాలున్నాయి. దర్యాప్తులో అసలు విషయం బయటపడుతుందని ఆశిస్తున్నాము,” అని అన్నారు.

గతంలో అంటే...జూలై, 1988లో అమెరికా కూడా ఇదేవిధంగా పొరపాటున ఇరాన్‌కు చెందిన విమానాన్ని క్షిపణులతో దాడి చేసి కూల్చివేసింది. టెహ్రాన్ నుంచి దుబాయ్ వెలుతున్న ఆ విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 290 మంది చనిపోయారు. ఇటీవల ఇరాన్‌ అదే విషయం ప్రస్తావిస్తూ అమెరికా చేసిన ఆ తప్పు గురించి మరోసారి లోకానికి చాటి చెప్పింది. కానీ ఇప్పుడు ఇరాన్‌ కూడా అదే తప్పు చేసినట్లుంది. ఆ పొరపాటుకు 178 మంది బలైపోయారు. వారి కుటుంబాలకు తీరని శోకం మిగిలింది.


Related Post