తెరాసకు కూడా ఫిరాయింపుల బాధ?

January 10, 2020


img

రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరుతుండటం మామూలే. కానీ ఈసారి తెరాసకు కూడా ఫిరాయింపుల బాధ తప్పడం లేదు. రంగారెడ్డి జిల్లా, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో తెరాసకు చెందిన మాజీ కౌన్సిలర్ సంతోషి ఆమె భర్త, తెరాస మున్సిపల్ కమిటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఛైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, తెరాస మండల కమిటీ అధ్యక్షుడు మర్రి హన్మంత్ రెడ్డి తదితరులు కూడా తెరాసకు రాజీనామా చేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్ళెం నర్సింహారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

నాలుగు రోజుల క్రితమే బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో గుర్రంగూడ    మాజీ ఇన్‌చార్జి సర్పంచ్‌ జక్కిడి జంగారెడ్డి కూడా తెరాసకు గుడ్ బై చెప్పేసి బిజెపిలో చేరిపోయారు. 

మాజీ కౌన్సిలర్ సంతోషి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత బడంగ్‌పేట్‌లో మీడియాతో మాట్లాడుతూ, "మాపని తీరు బాగుంది కనుక ఈసారి కూడా సిట్టింగులకే టికెట్స్ ఇస్తానని హామీ ఇచ్చారు కానీ ఆఖరు నిమిషంలో వేరేవారికి టికెట్ ఇచ్చి మా అందరికీ అన్యాయం చేశారు. పార్టీలో గౌరవం లేనప్పుడు కొనసాగడం అనవసరం. అందుకే మేము పార్టీని వీడుతున్నాము," అని చెప్పారు.


Related Post