నేడు నాంపల్లి సిబిఐ కోర్టుకు ఏపీ సిఎం!

January 10, 2020


img

నేడు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఆయనతో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి కూడా అక్రమాస్తుల కేసుల విచారణకు హాజరుకానున్నారు. ఆ కేసులలో వారిరువురూ ఏ-1, ఏ-2 నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. 

ఈ కేసులపై ప్రతీ శుక్రవారం జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరవ్వాలనే షరతుపైనే వారిరువురికీ సిబిఐ కోర్టు బెయిల్‌పై మంజూరు చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు..ఆ తరువాత వాటిలో వైసీపీ గెలిచి అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో గత ఏడాది మార్చి నుంచి సిబిఐ విచారణకు హాజరుకాలేకపోతున్నారు. అప్పటి నుంచి వారిరువురూ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందుతున్నారు. 

కానీ ముఖ్యమంత్రి, ఎంపీ హోదాలో ఉన్నమనే కారణంతో పదేపదే వ్యక్తిగత మినహాయింపు ఇవ్వడం సరికాదనే సిబిఐ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బిఆర్ మధుసూధన్ రావు, ఈరోజు (శుక్రవారం) జరుగబోయే విచారణకు వారిరువురూ తప్పనిసరిగా హాజరుకావలని లేకుంటే ‘కటిన నిర్ణయం’ తీసుకోవలసి ఉంటుందని గట్టిగా హెచ్చరించడంతో నేడు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి ఇద్దరూ విచారణకు హాజరయ్యేందుకు నాంపల్లి సిబిఐ కోర్టుకు రానున్నారు. కనుక కోర్టు పరిసరాలలో బారీగా పోలీసులను మోహరించి భద్రతా ఏర్పాట్లను చేశారు. 

సాధారణంగా ఎటువంటి కేసులలోనైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టుకు రప్పించడమే చాలా పెద్ద విషయంగా... అవమానంగా భావిస్తుంటారు. అటువంటిది ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి  సిబిఐ కోర్టు విచారణకు హాజరు కావలసిరావడం...అది కూడా అవినీతి ఆరోపణల కేసులలో నిందితులుగా బోనులో నిలబడవలసిరావడం వారికీ.. ప్రభుత్వానికి.. ఏపీ ప్రజలకు కూడా అవమానకరంగానే ఉంటుంది. 


Related Post