అప్పుడు కాంగ్రెస్‌...ఇప్పుడు తెరాస: బండి సంజయ్

January 09, 2020


img

బిజెపి అధ్వర్యంలో బుదవారం వరంగల్‌ వేయిస్తంభాల గుడి నుంచి హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వరకు సీఏఏ చట్టానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. దానిలో పాల్గొన్న కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెరాస, మజ్లీస్, కాంగ్రెస్‌ పార్టీలు తమ రాజకీయప్రయోజనాల కోసం సీఏఏ చట్టం గురించి దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయి. దేశభద్రత కోసం తెచ్చిన సీఏఏని వ్యతిరేకించేవారెవరైనా సరే.. అందరినీ బ్రేకుల్లేని బస్సులలో ఎక్కించి పాకిస్తాన్ పంపించేస్తాము... జాగ్రత్త!” అని హెచ్చరించారు. 

తెరాస-మజ్లీస్ పార్టీల గురించి మాట్లాడుతూ, “ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉంది. మున్సిపల్ ఎన్నికలలో తెరాసకు ఓటు వేస్తే మజ్లీస్ పార్టీకి వేసినట్లే. నిజానికి తెరాస కారు స్టీరింగ్ మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేతుల్లో ఉంది. అందుకే తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వని సిఎం కేసీఆర్‌, అసదుద్దీన్ ఓవైసీకి మాత్రం వెంటనే అపాయింట్మెంట్ ఇస్తుంటారు...సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో మజ్లీస్ నిర్వహిస్తున్న సభలను అనుమతిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లీస్ పార్టీని భుజాన్ని మోసిమోసి వెన్నెముక విరుగగొట్టుకొంది. ఇప్పుడు తెరాస సర్కార్ మజ్లీస్ పార్టీని భుజాన్న మోస్తోంది కనుక రేపు దానికీ అదే పరిస్థితి ఎదురవవచ్చు,” అని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో ముస్లింలకు మజ్లీస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోందని భావించినందునే గతంలో కాంగ్రెస్‌ పార్టీ దానితో దోస్తీ చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తెరాస కూడా అదే కారణంతో మిగిలిన అన్ని పార్టీలను బలహీనపరిచి మజ్లీస్‌తో దోస్తీ కొనసాగిస్తోంది. దానితో దోస్తీ చేస్తేనే రాష్ట్రంలో ముస్లింలు తమకు ఓట్లు వేస్తారనే ఆలోచనతోనే మజ్లీస్ పార్టీతో దోస్తీ కొనసాగిస్తున్నాయనుకోవచ్చు. అదీగాక హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడటం కోసం కూడా మజ్లీస్‌తో దోస్తీ అవసరమని భావిస్తుండవచ్చు. పైకి ఈ కారణాలు చెప్పకపోయినా అవేనని అందరికీ తెలుసు. బండి సంజయ్ మాటలకు అర్ధం ఇదే కావచ్చు. 


Related Post