అప్పుడు రెండు కళ్ళు...ఇప్పుడు ఒకే కన్ను!

January 09, 2020


img

రాష్ట్ర విభజన సమయంలో టిడిపి తెలంగాణలో అనుకూలంగా, ఏపీలో వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించింది. ఆంధ్రా, తెలంగాణలు తనకు రెండు కళ్ళు కనుక రెండు ప్రాంతాలలో ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆవిధంగా చేయవలసి వచ్చిందని చంద్రబాబునాయుడు సంజాయిషీ చెప్పుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయనకు అటువంటి అగ్నిపరీక్షే ఏపీలో ఎదురవుతోంది. 

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు...అమరావతిలో ప్రత్యక్ష పోరాతాలకు సిద్దం అయ్యారు కూడా. అయితే రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ళు సిద్దాంతం అవలంభించిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు మూడు ప్రాంతాలు మూడు కళ్ళు అని అనకుండా ఒకే కన్ను అంటున్నారు. 

ఒకవేళ అమరావతిలోనే రాజధాని ఉండాలనేది టిడిపి అభిప్రాయమైతే, రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలలోని టిడిపి నేతలు కూడా తమ తమ ప్రాంతాలలో అమరావతి కోసం పోరాటాలు చేయాలి లేదా కనీసం అమరావతి కోసం పోరాడుతున్న తమ అధినేత చంద్రబాబునాయుడుకు సంఘీభావం తెలియజేయాలి. కానీ ఆవిధంగా చేస్తే రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలలో ప్రజలకు ఆగ్రహం కలిగించినట్లవుతుంది. ఆ జిల్లాలను అభివృద్ధి చేయాలనుకొంటే టిడిపి అభ్యంతరం చెపుతోందంటూ వైసీపీ ప్రచారం చేసుకొంటే రాజకీయంగా నష్టపోతారు. అందుకే అందరూ మౌనం వహిస్తున్నారు. కనుక అమరావతి కోసం టిడిపి చేస్తున్న పోరాటాన్ని శంఖించవలసివస్తోంది.

ఈవిషయంలో బిజెపి కూడా అదేవిధంగా వ్యవహరిస్తోంది. పైగా రాష్ట్ర నేతలు మూడు రాజధానుల ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే, ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కనుక దానితో తమకు సంబందం లేదన్నట్లు బిజెపి అధిష్టానం మాట్లాడుతూ ద్వందవైఖరి ప్రదర్శిస్తోంది. 

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే, ఏపీ ఓ రాజకీయ ప్రయోగశాలగా మారిపోయింది. దాంతో ఏపీ.. ప్రజల భవిష్యత్‌ అగమ్యగోచరంగా కనిపిస్తోంది.


Related Post