ఓవైసీ ఎందుకు భుజం తడుముకొంటున్నారో?

January 08, 2020


img

ట్విట్టర్‌లో సురేశ్ అనే వ్యక్తి అడిగిన ఓ ప్రశ్నకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ చెప్పిన సమాధానం చూసి మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కోపం వచ్చింది. 

‘హైదరాబాద్‌లోని అమెరికన్ కంపెనీలలో జిహాదీలు ఎవరైనా పనిచేస్తున్నారా?” అని సురేశ్ అనే వ్యక్తి ప్రశ్నించగా, “యస్ సర్.. అవంటివారిని కనుగొనేందుకు మావద్ద 24x7 గంటలు పనిచేసే ప్రత్యేక బృందాలున్నాయి. మమ్మల్ని అప్రమత్తం చేసినందుకు కృతజ్ఞతలు. మీకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే దయచేసి మాకు తెలియజేయండి,” అని సజ్జనార్ సమాధానం ఇచ్చారు. 

సురేశ్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నలో...దానికి సిపి సజ్జనార్ చెప్పిన సమాధానంలో ఎటువంటి తప్పు లేదని అర్ధమవుతూనే ఉంది. కానీ అసదుద్దీన్ ఓవైసీకి అది తప్పుగా అనిపించింది. వెంటనే స్పందిస్తూ, “సిపి సజ్జనార్ గారు మీరు ఏవైనా చేయండి కానీ తెల్లవారుజామున 5 గంటలకు ఎన్‌కౌంటర్‌లు మాత్రం చేయకండి. అవసరమైతే నిందితులను అరెస్ట్ చేసి నాలుగు తగిలించి నిజాలు రాబట్టండి కానీ దయచేసి కడుపులో ఏదో పెట్టుకొని మాట్లాడకండి సాబ్. ఉగ్రవాదానికి మతం లేదనే సంగతి తెలుసుకోండి,” అని ట్విట్టర్‌లో మెసేజ్ పెట్టారు. 


నిజానికి ‘హైదరాబాద్‌లో ఎవరైనా ఉగ్రవాదుల సానుభూతిపరులున్నారా?’ అనే ప్రశ్నకు అసదుద్దీన్ ఓవైసీకి ఎందుకు భుజాలు తడుముకొంటున్నారో..ఎందుకు కోపం వచ్చిందో తెలీదు. ఒకవేళ ఉగ్రవాదులో వారి సానుభూతిపరులో నగరంలో రహస్యంగా నివసిస్తున్నట్లయితే అది అసదుద్దీన్ ఓవైసీతో సహా ప్రజలందరికీ ప్రమాదమే. కనుక పోలీస్ శాఖలో నిఘా బృందాలు 24x7 గంటలు పనిచేస్తూ నగరప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నాయని చెప్పినందుకు సిపి సజ్జనార్‌ను అసదుద్దీన్ ఓవైసీ మెచ్చుకోవాలి కానీ ఆగ్రహం వ్యక్తం చేశారెందుకో? పైగా దిశ ఎన్‌కౌంటర్‌ ప్రస్తావన చేస్తూ పోలీసులు తప్పు చేశారన్నట్లు నిందించారు. 

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా...హైదరాబాద్‌ నగరం ఎంతో ప్రశాంతంగా ఉంటోందంటే అది పోలీసుల చలువే కదా? వారు రేయింబవళ్లు నిఘా పెట్టి పనిచేస్తుండబట్టే ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి తప్ప ఈవిధంగా వేలెత్తి చూపడం సరికాదు.


Related Post