మున్సిపల్ ఎన్నికలకు టిడిపి సై...జనసేన నై!

January 08, 2020


img

త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయడానికి టిడిపి సిద్దం అవుతుంటే, జనసేన పార్టీ మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొంది. మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉండటానికి జనసేన పార్టీ ఎటువంటి కారణమూ తెలియజేయలేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన పోటీకి దూరంగా ఉండాలనుకొంటునట్లు తెలియజేసింది. ఈ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. అయితే రాష్ట్రమంతటా కాక స్థానికంగా బలం ఉన్న స్థానాలలో మాత్రమే పోటీ  చేస్తామని ఎల్.రమణ తెలిపారు. 

2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్ట్, టిడిపిలు పొత్తులు పెట్టుకొని పోటీ చేసినప్పటికీ తెరాస చేతిలో ఘోరపరాజయం పాలయ్యాయి. ఆ తరువాత జరిగిన ఏ ఎన్నికలలోనూ అవి మళ్ళీ కలిసి పోటీ చేసే ఆలోచన చేయలేదు. అయితే అవి కలిసిపోటీ చేసినా...వేర్వేరుగా పోటీ చేసినా వాటిలో ఏదీ కూడా తెరాసను ఓడించలేక చతికిలపడుతున్నాయి. 

మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన స్థానాలు సంపాదించుకోవచ్చు కానీ కష్టపడి గెలిపించుకొన్నవారిని పార్టీలో నిలుపుకోలేకపోతుండటం వలన కాంగ్రెస్ పార్టీ కష్టం ప్రతీసారి బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. బహుశః మున్సిపల్ ఎన్నికల తరువాత కూడా అదే జరుగవచ్చు. లోక్‌సభ ఎన్నికలలో మ్యాజిక్ చేసిన బిజెపి మున్సిపల్ ఎన్నికలలో కూడా చేయగలిగితేనే తెలంగాణలో బిజెపి బలపడుతోందనే ఆ పార్టీ నేతల వాదనలకు అర్ధం ఉంటుంది లేకుంటే కష్టమే.


Related Post