ఏపీ-తెలంగాణల మద్య మళ్ళీ కొత్త వివాదం!

January 08, 2020


img

ఇదివరకు చంద్రబాబు-కేసీఆర్‌ ఉప్పు నిప్పులా ఉండేవారు కనుక రెండు రాష్ట్రాల మద్య చిన్నచిన్న సమస్యలు కూడా అపరిష్కృతంగా ఉండిపోయాయంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ కేసీఆర్‌-జగన్‌ల మద్య, రెండు ప్రభుత్వాల మద్య ఇప్పుడు మంచి స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉన్నప్పుడు కూడా సమస్యలు పరిష్కరించుకోలేకపోగా మళ్ళీ కత్తులు దూసుకొనేందుకు సిద్దపడుతుండటం చాలా ఆశ్చర్యకరం. 

సుమారు నాలుగేళ్ళ క్రితం..అంటే 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆంద్రాకు చెందిన 1,150 మంది ఉద్యోగులను డ్యూటీల నుంచి రిలీవ్ చేసి ఆంధ్రాకు అప్పగించాయి. కానీ అప్పుడు ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది కనుక వారిని తీసుకొనేందుకు చంద్రబాబు సర్కార్ నిరాకరించింది. అప్పటి నుంచి ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

ఈ సమస్య సుప్రీంకోర్టుకు చేరడంతో గత ఏడాది నవంబరులో రిటైర్డ్ జడ్జి ధర్మాధికారి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ చేసిన సూచనలు, ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ధర్మాధికారి కమిటీ తన నివేదికను హైకోర్టుకు సమర్పించి చేతులు దులుపుకొంది. దానిపై స్పందించిన హైకోర్టు తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇచ్చిన రిలీవింగ్ ఆదేశాలను కొట్టివేసింది. 

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. ధర్మాధికారి కమిటీ సూచనల మేరకు 1,150 మందిలో 229 మందిని మళ్ళీ విధులలో చేర్చుకోవడానికి అంగీకరించామని కానీ మిగిలినవారిని చేర్చుకోవడానికి ఆంధ్రా విద్యుత్ సంస్థలు అంగీకరించడంలేదని తమ పిటిషన్‌ ద్వారా ఫిర్యాదు చేశాయి. 

ఇదిలా ఉండగా తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసినవారిలో 653 మంది ఉద్యోగులు సోమవారం విజయవాడకు వెళ్ళి తమను విధులలోకి తీసుకోవాలని విద్యుత్ అధికారులను కోరారు. కానీ విద్యుత్ శాఖలో, సంస్థలలో ప్రస్తుతం పోస్టులు ఖాళీలేవని, పైగా సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది కనుక వారిని విధులలో చేర్చుకోలేమని ఏపీ అధికారులు చెప్పడంతో వారందరూ సోమవారం విజయవాడలోని విద్యుత్ సౌధా ముందు ధర్నా చేశారు. 

సుమారు 20-30 ఏళ్ళు పనిచేసిన తరువాత ఇప్పుడు ఇటు తెలంగాణలోను తీసుకోక...అటు ఆంద్రాలోనూ ఉద్యోగాలలోకి తీసుకోకపోతే తమ పరిస్థితి ఏమిటి? ఎవరికి మొరపెట్టుకోవాలని వారు అడుగుతున్నారు. ఇది వారి బతుకు సమస్య కనుక మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించకమానరు. ఇప్పటికే ఈ సమస్యపై తెలంగాణతో సుప్రీంకోర్టులో పోరాడేందుకు ఏపీ సర్కార్ సిద్దం అయ్యింది. 

ఈనెల 11 నుంచి 13వ తేదీలోగా ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఇరువురూ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ భేటీలో వారిరువురూ ఈ సమస్యను పరిష్కరించుకోగలిగితే మంచిది. ఒకవేళ వారు పరిష్కరించుకోలేకపోతే మళ్ళీ రెండు రాష్ట్రాల మద్య కత్తియుద్ధం మొదలవుతుంది. 


Related Post