ఎన్నికలొచ్చాయి..ఫిరాయింపులు షురూ

January 08, 2020


img

ఎక్కడ ఎప్పుడు ఏ ఎన్నికలు జరుగుతున్నా రాజకీయ నాయకులు పార్టీలు ఫిరాయించడం ఆనవాయితీగా మారిపోయింది కనుక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల గంట మ్రోగగానే రాష్ట్రంలో ఫిరాయింపులు కూడా మళ్ళీ మొదలైపోయాయి. కరీంనగర్‌లో మాజీ కాంగ్రెస్‌ కార్పొరేటర్ మేచినేని అశోక్ రావు, బిజెపి అనుబంద ఉపాద్యాయ సంఘం నేత దామర మహేందర్ రెడ్డి మంగళవారం మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో తెరాసలో చేరారు. వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి బలమైన, కష్టపడి పనిచేసే గుణం ఉన్న అభ్యర్ధులనే నిలబెడుతున్నాము. కనుక       మున్సిపల్ ఎన్నికలలో కరీంనగర్‌లో నూటికి నూరుశాతం తెరాస గెలుపు ఖాయం. అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసి చూపుతున్న కారణంగా ప్రజలు తెరాసవైపే ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రజాధారణ కోల్పోయాయి. ఈ ఎన్నికల తరువాత ఆ రెండు పార్టీలు జిల్లాలో కనబడకుండాపోతాయి,” అని అన్నారు. 

కాంగ్రెస్, బిజెపిలకు ప్రజాధారణ లేదంటూనే అవే పార్టీల నేతలను తెరాసలో చేర్చుకోవడం విచిత్రమనుకొంటే, తెరాసలో చేరగానే వారందరూ అగ్నిపునీతులైనట్లు పరిగణించడం ఇంకా విచిత్రం. వారి ఎదుటే తెరాస నేతలు కాంగ్రెస్‌, బిజెపిలను దూషిస్తుంటే వారు చిర్నవ్వులు చిందిస్తుండటం ఇంకా విచిత్రం.


Related Post