అమెరికా స్థావరాలపై ఇరాన్ మిసైల్ దాడులు

January 08, 2020


img

ఇరాన్-అమెరికా దేశాల మద్య యుద్ధం మొదలైంది. ఇరాన్ కమాండర్ జనరల్ ఖాసిం సులేమానిపై అమెరికా దళాలు దాడిచేసి హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకొంటామని ప్రకటించిన ఇరాన్, మంగళవారం సాయంత్రం సులేమాని అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఒకేసారి వరుసగా 12 క్షిపణులతో దాడి చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం స్వయంగా దృవీకరించింది. ఈ దాడులను అమెరికా రక్షణశాఖ కూడా దృవీకరించింది. ఇరాన్ తమపై ప్రతీకారదాడులు చేస్తే అమెరికా కూడా చాలా చురుకుగా, భీకరంగా ప్రతిదాడులు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు. ఇరాన్‌లోని రాజకీయ, సైనిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన 52 లక్ష్యాలను గుర్తించామని వాటిపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. కనుక అమెరికా కూడా నేడు ఇరాన్‌పై దాడులు చేయడం ఖాయమనే భావించవచ్చు.


అదేజరిగితే ఇరాన్‌ కూడా ఇరాక్‌కు మద్దతుగా నిలిచి ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేయడం ఖాయం. అప్పుడు అమెరికా ఇరాక్‌పై కూడా దాడులు చేయడం ఖాయం. అదే జరిగితే గల్ఫ్ దేశాలలో కొన్ని ఇరాన్, ఇరాక్‌ దేశాలకు అండగా యుద్ధంలో దిగే అవకాశాలున్నాయి. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ తదితర దేశాలు అమెరికాకు వంతపాడుతుంటాయి కనుక అవి కూడా ప్రత్యక్ష యుద్ధంలో దిగకపోయినా  అమెరికాకు మద్దతు ప్రకటించవచ్చు. కనుక పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొన్నట్లే. "మేము యుద్ధం ప్రారంభించలేదు... యుద్ధం జరుగకుండా నివారించేందుకే సులేమానీని హతమార్చామని" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న, జరుగబోయే ఈ పరిణామాలు చూస్తే ఆయనే స్వయంగా ఈ యుద్ధం ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది.  

యుద్ధం వార్తలు వినబడినప్పుడే భారత్‌తో సహా ప్రపంచదేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడం మొదలయ్యాయి. ఇక యుద్ధం మొదలైతే ఇంకా పెరిగిపోవచ్చు. మొన్నటివరకు ఉల్లిపాయలు కొనలేక నానాతిప్పలు పడిన ప్రజలు, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఉల్లిపాయలతో సహా అన్ని వస్తువుల ధరలు పెరిగితే ఇబ్బందులు ఎదుర్కోవలసిరావచ్చు. హ్యాపీ న్యూఇయర్ అంటూ జనాలు మందేసి...చిందేసిన వారంరోజులకే 2020 సంవత్సరం భయానకంగా మారుతుండటం చాలా ఆందోళనకలిగించే విషయమే. 


Related Post